ఏపీలో 2014 కూటమి…?

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో మారుతున్న రాజకీయ సవిూకరణాలు ఆ నానుడికి అద్దంపట్టేవిగానే ఉన్నాయి. దాదాపు ఐదేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న బీజేపీ తెలుగుదేశం పార్టీలు మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఏపీలో తెలుగుదేశంతో మైత్రి బీజీపీకి తెలంగాణలో రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందన్నది కమలం పార్టీ భావన. అలాగే ఏపీలో బీజేపీతో మైత్రి అధికార వైసీపీని ఇబ్బందుల్లో నెట్టి విజయాన్ని నల్లేరు విూద బండి నడక చేసుకోవడానికి దోహదపడుతుందని తెలుగుదేశం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే.. తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు కోరుకుంటోంది. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకత్వం పార్టీ అగ్రనాయకత్వానికి చేరవేసిందని పార్టీ శ్రేణులో అంటున్నాయి.తెలంగాణలో కమలం పార్టీ అధికారం చేపట్టాలంటే తెదేపా సహకారం అవసరం అని బీజేపీ అగ్రనాయకత్వం కూడా గుర్తించిందని చెబుతున్నారు. ఇక అదే సమయంలో ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేనల మధ్య అప్రకటిత పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా మైత్రి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తెలుగుదేశంతో కలవడం ఉభయతారకంగా ఉంటుందన్న అభిప్రాయం కమలం అగ్రనాయకత్వంలో కలిగిందని అంటున్నారు. ఆ కారణంగానే ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ దూరాన్ని పాటిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇంత కాలం.. వైసీపీ ఉ అంటే ఉ, ఉహూ అంటే ఉహూ అన్నట్లుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరించినా ఆ పార్టీ అధిష్ఠానం చూసీ చూడనట్లు వదిలేసింది. అయితే ఇటీవలి కాలంలో అటు బీజేపీ అగ్రనాయకత్వంలోనూ, ఇటు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపించింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలపై అటు బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులూ కూడా ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశం కూడా.. ఇటీవలి కాలంలో బీజేపీ విధానాలకు సంబంధించి ఎటువంటి విమర్శలూ చేయలేదు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాట్ల విషయంలోనూ జోక్యం చేసుకోలేదు.తాజాగా ఒక జాతీయ టీవీ చానెల్‌ నిర్వహించిన సదస్సులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీజేపీ మోడల్‌ అభివృద్ధికి, ప్రధాని మోడీ విజన్‌ కు సంపూర్ణ మద్దతు ప్రకటించేశారు. పనిలో పనిగా గతంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడానికీ, బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి విభేదాలు కారణం కాదనీ, సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా అంశమేననీ కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యతకు అధికారిక ప్రకటనే తరువాయి అంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రంలో జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీతో కలవడం అన్న ఊహే జగన్‌ సర్కార్‌ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది.అందుకే గతంలో హస్తినలో ఒక కార్యక్రమంలో మోడీ స్వయంగా చంద్రబాబును పలకరించి కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో ఉలిక్కిపడిరది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి భుజాలు తడుముకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయన్నఅభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఈ మార్పు కచ్చితంగా అధికార వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *