బెజవాడలో ముగ్గురు పేర్లు ఖరారు…

విజయవాడ, ఆగస్టు 17
విజయవాడలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించేశారు. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు దేవినేని అవినాష్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్‌ దక్కుతుందో, ఎవరి అదృష్టం మారిపోతుందోననే ఆందోళన వైసీపీ నాయకులందరిలో ఉంది. సర్వే ఫలితాలు, సవిూక్షలు, గడపగడప పర్యటనలు, నాలుగైదు సర్వేల్లో అభ్యర్థుల జాతకాలు పరిశీలించిన తర్వాత కానీ క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే విజయవాడలో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్‌, విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమం నుంచి వెలంపల్లి శ్రీనివాస్‌ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.గత కొద్ది నెలలుగా విజయవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారుస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వెల్లంపల్లి, మల్లాది విష్ణుల స్థానంలో ఇతరుల్ని బరిలో దింపుతారని పార్టీతో పాటు బెజవాడ పొలిటికల్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలిద్దరి పేర్లు సజ్జల నోటి వెంట రావడంతో అంతా అవాక్కయ్యారు. ఇది సిఎం నిర్ణయమా, సజ్జల యథాలాపంగా అన్నారో తెలీక తలలు పట్టుకుంటున్నారు.విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే తాను సూచించిన వారికి టిక్కెట్‌ ఇవ్వాలని వెల్లంపల్లి కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వెల్లంపల్లి అనుచరులుగా ఉన్న వారు కూడా ఎమ్మెల్యే పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారినే గెలిపించాలని సజ్జల చెప్పడంతో అంతా ఉసూరుమంటున్నారు.రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు, అల్లర్లు, సంక్షోభాలను సృష్టించడం ద్వారా అధికారం పొందాలని చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు మొదట పులివెందులలో గొడవలు సృష్టించేందుకు ట్రైచేశారని, కుదరకపోవడంతో పుంగనూరులో టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు.రూట్‌ మ్యాప్‌ మార్చి గొడవలకు దిగారన్నారు. చివరకు పోలీసులపైనే దాడి చేశారని పోలీసులు చాలా సంయమనం పాటించడం వల్ల చంద్రబాబు ఆలోచన అమలు కాలేదన్నారు.పుంగనూరులో చంద్రబాబు వ్యవహరించిన తీరు సభ్యసమాజంలో బాధ్యత కలిగిన ఒక మనిషి కూడా వ్యవహరించడని, నేరప్రవృత్తి కలిగిన సినిమా విలన్‌ మాత్రమే అలా చేయగలడన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేయొచ్చని దానిని కాదనడం లేదని ప్రజలను రెచ్చగొట్టి హింసయుత సంఘటనలు జరిగేలా ఆలోచన చేయడాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు.వైయస్సార్‌ సిపి రిజెక్ట్‌ చేసిన వారిని తనతో తిప్పుకుని తానేదో విజయం సాధించానని గొప్పలు పోతుంటాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు జ్ఞాపక శక్తి ఉండదని చంద్రబాబుకు అపారమైన నమ్మకమని తాము వదిలేసిన చెత్తను పోగేసుకుని తన విజయంగా చంద్రబాబు చెప్పుకుంటున్నాడని ఎధ్దేవా చేశారు. చంద్రబాబు పదిమందితో కలసి ఎన్నికలకు వెళ్ళి ప్రజలలో అయోమయం సృష్టించి అధికారం పొందాలనే ఆలోచన చేస్తున్నాడన్నారు.పవన్‌ సీఎం సీటు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటున్నాడని, ఆయన ఎన్ని స్ధానాల్లో పోటీ చేస్తాడో ధైర్యంగా ప్రకటించడగలడా అన్నారు. తన కుమారుడు లోకేష్‌ వల్ల కానందునే తాను పవన్‌ కల్యాణ్‌ కు మద్దతిస్తున్నాని చంద్రబాబైనా చెప్పాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తాడో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని కోరారు. చంద్రబాబైనా…పవన్‌ కల్యాణ్‌ అయినా రాజకీయాల్లో సీరియస్‌ గా చిత్తశుద్ధితో ఉండాలనే కోరుకుంటున్నామని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ పార్టికి 175 నియోజకవర్గాలలో అభ్యర్దులే లేరన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *