సుదీర్ఘ పాదయాత్రకు రాహుల్‌ రెడీ

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతుండటంతో.. ఈసారి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సెప్టెంబర్‌7వ తేదీ నుంచి భారత్‌ జోడో యాత్రకు యువనేత రాహుల్‌ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 150 రోజుల పాటు 3,570 కిలోవిూటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 2024లో ఎక్కువ లోక్‌ సభ స్థానాలు గెలవాలన్న కాంగ్రెస్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈయాత్రను ఉపయోగించుకునేందుకు ప్లాన్‌ చేసింది. రోజుకు 20 కిలోవిూటర్ల వరకు ఎంపిక చేసిన 150 మందితో కలిసి రాహుల్‌ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తారు. ఈయాత్రలో ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకోనున్నారు. రోజూ నిర్ణీత కిలోవిూటర్ల పాదయాత్ర ముగిసిన తర్వాత తాత్కాలికంగా ఏర్పాటుచేసిన కంటెయినర్లలోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రజలతో ఎక్కువుగా కనెక్ట్‌ అయ్యేందుకు వీలుగా కాంగ్రెస్‌ నాయకత్వం ఈయాత్రను ప్లాన్‌ చేసింది. రెండు దశాబ్ధాల రాజకీయ జీవితంలో రాహుల్‌ గాంధీ చేయబోతున్న అతిపెద్ద ప్రచారమే కాకుండా.. ప్రజలను కలిసేందుకు కాంగ్రెస్‌ చేపట్టబోతున్న అతిపెద్ద కార్యక్రమంగా భారత్‌ జోడో యాత్ర నిలవనుంది.
గాంధీ కుటుంబంపై ప్రజల్లో ఆదరణ తగ్గకుండా.. గాంధీ ఫ్యామిలీ ఇమేజ్‌ పెంచేందుకు ఓ ప్రయత్నంగా ఈయాత్రను కాంగ్రెస్‌ చూస్తోంది. రాహుల్‌ గాంధీ నాయకత్వ లక్షణాలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు భారత్‌ జోడ్‌ యాత్రను హస్తం పార్టీ ఓ ఆయుధంగా భావిస్తోంది. కేవలం రాజకీయపార్టీగా కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఓ పాదయాత్రగా కాకుండా.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని.. ప్రజా సమస్యలపై పోరాడే యాత్రగా ప్రజల్లో సందేశాన్ని పంపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. దీనికోసం ఇప్పటికే ఢల్లీిలో రాహుల్‌ గాంధీ.. పౌరసమాజం నాయకులతో సమావేశమై యాత్రకు సంబంధించిన అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. భారత్‌ జోడో యాత్రలో ఏపార్టీ జెండాలు, నాయకుల అనుకూల నినాదాలు ఉండబోవని తేల్చిచెప్పారు. దీనికి అనుగుణంగానే మంగళవారం పార్టీ నాయకులు విడుదల చేసిన యాత్రకు సంబంధించిన లోగోలో కాంగ్రెస్‌ పార్టీ లోగో గాని, రాహుల్‌ గాంధీ ఫోటో గాని లేదు. భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ కీలకపాత్ర పోషించనుంది.
రాహుల్‌ గాంధీతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు ఈయాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అయినప్పటికి.. పార్టీ జెండాలేకుండా.. జాతీయ జెండా చేతబూని ఈయాత్ర చేయాలని కాంగ్రెస్‌ ప్లాన్‌ చేసింది. వాస్తవానికి పార్టీ జెండాలేకపోయినా.. రాహుల్‌ గాంధీ చేపడుతున్న యాత్ర కావడంతో ప్రజలు దీనిని కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పాయాత్రగానే చూసే అవకాశం ఎక్కువుగా ఉంది. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈయాత్రను నిర్వహించనుంది. పార్టీలకు అతీతంగా ఈయాత్ర చేపడుతున్నామని రాహుల్‌ గాంధీ విజ్ఞప్తిచేసినా.. ఈయాత్రకు మద్దతు ఇవ్వడం లేదా యాత్రలో పాల్గొనే అంశంపై పౌరసమాజానికి చెందిన ప్రముఖులు ఎవరూ సానుకూలంగా స్పందించిన దాఖాలాలు లేదు. ఈక్రమంలో భారత్‌ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్‌ తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *