ఫ్లోటింగ్‌ జెట్టీతో గంగపుత్రులు…వెలుగురేఖలు

విజయనగరం గంగపుత్రుల జీవితాల్లో వెలుగురేఖలు విచ్చుకోనున్నాయి. ఆధునిక వసతులను సమకూర్చడం ద్వారా, మత్స్యకారుల జీవన భృతికి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటిలో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణం మలుపుగా చెప్పవచ్చు. సుమారు రూ.23.73 కోట్ల ఖర్చుతో విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చింతపల్లి వద్ద నిర్మితమయ్యే ఈ ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్‌ పనులను, మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి ప్రారంభిస్తారు. ఈ జెట్టీ నిర్మాణం పూర్తయితే మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పర్యాటక పరంగా కూడా చింతపల్లి ప్రాంతం అభివృద్ది చెందుతుంది. విజయనగరం జిల్లా కేంద్రానికి 25 కిలోవిూటర్ల దూరంలో, పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి సముద్ర తీరం వద్ద ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్‌ (ఫ్లోటింగ్‌ జెట్టీ)ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే ఆరు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. చింతపల్లితోపాటు చుట్టుప్రక్కల ప్రాంతంలోని తిప్పలవలస, మద్దూరు, కొత్తూరు, బర్రిపేట, నీలగెడ్డపేట, తమ్మయ్యపాలెం, పులిగెడ్డపాలెం, పతివాడ బర్రిపేట తదితర చోట్ల 16 ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో అతిపెద్దదైన చింతపల్లి వద్ద ఈ ఫ్లోటింగ్‌ జెట్టీని నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సుమారుగా రూ.23.73కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.విజయనగరం జిల్లాలో సుమారు 21.44 కిలోవిూటర్ల మేర సముద్ర తీరం ఉంది. చింతపల్లి వద్ద ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణం వల్ల సుమారు 4వేల మత్స్యకార కుటుంబాల్లోని 20 వేలమందికి మేలు జరుగుతుంది. జిల్లాలో గుర్తించబడిన 711 మోటరైజ్‌డ్‌ ఫిషింగ్‌ బోట్లు, 417 సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క చింతపల్లి ప్రాంతంలోనే 487 మోటరైజ్‌డ్‌ ఫిషింగ్‌ క్రాప్ట్స్‌, 361 సంప్రదాయ పిషింగ్‌ బోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో పూడిమడక తరువాత, చింతపల్లే రెండో పెద్ద ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్‌గా చెప్పవచ్చు. ఇక్కడ జెట్టీ నిర్మాణం వల్ల మత్స్యకారులు నిర్భయంగా సముద్రంలోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. రాత్రి పగలూ చేపల వేటకు వెళ్లొచ్చు. మత్స్యకారులు తాము వేటాడిన చేపలను సులువుగా ఒడ్డుకు చేర్చడానికి వీలు అవుతుంది. మేలైన మత్స్య ఉత్పత్తులు ప్రజలకు సరఫరా అవుతాయి. తుఫాన్లు లాంటి సమయంలో జెట్టీ వల్ల మత్స్యకారుల పడవలకు రక్షణ లభిస్తుంది. లంగరు వేసుకోవడం సులువు అవుతుంది.సముద్ర తీరం నుంచి కెరటాలను దాటుకొని సముద్రంలోకి ప్రవేశించడం అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. అందుకే కెరటాలు దాటి వెళ్లడం పునర్‌జన్మతో పోలుస్తారు. ఈ సమయంలోనే ఎక్కువమంది మత్స్యకారులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతుంటారు. దీనికి భయపడి చాలామంది మత్స్యకారులు తమ వృత్తిని వదిలిపెట్టడం లేదా, జెట్టీ ఉన్న ప్రాంతానికి వలస వెళ్లిపోవడం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో చేపలవేటలో అత్యంత నైపుణ్యం ఉన్న మత్స్యకారులు ఉన్నారు. వీరి నైపుణ్యానికి గొప్ప గుర్తింపు ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్లినా, విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు కనిపిస్తారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో పనిచేస్తున్న బోటు డ్రైవర్లలో సగం మంది విజయనగరం జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. జెట్టీ నిర్మాణం వల్ల వీరంతా తమ ప్రాంతాలకు తిరిగివచ్చి, ఇక్కడే తమ కులవృత్తిని నిర్వహించుకొనే అవకాశం లభిస్తుంది. తద్వారా పురుష?లతోపాటు మత్య్సకార మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు రెట్టింపవుతాయి. చింతపల్లిలో జెట్టీ నిర్మాణం జరిగితే, పర్యాటక పరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుంది. ఇప్పటికే చింతపల్లి బీచ్‌ జిల్లాలో ఏకైక సముద్రతీర సందర్శనీయ ప్రాంతంగా ఉంది. చింతపల్లి లైట్‌ హౌస్‌ కూడా నిత్యం సందర్శకులను ఆకర్షిస్తుంటుంది. ఇక్కడి కొండ సుమారు ఐదు కిలోవిూటర్ల మేర సముద్రంలోకి పొడుచుకుపోయి ఉంటుంది. ఈ ప్రాంతంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన పడవ అవశేషాలు ఇప్పటికీ కనబడతాయని మత్స్యకారులు చెబుతారు. పర్యాటక ప్రదేశంగా ఈ కొండ ప్రాంతాన్ని అభివృద్ది చేయవచ్చు. అలాగే స్కూబా డైవింగ్‌ కు కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. భోగాపురం విమానాశ్రయానికి దగ్గర ప్రాంతం కావడంతో, జాతీయ రహదారి కూడా సవిూపంలోనే ఉండటంతో, పర్యాటక కోణంలో కూడా చింతపల్లి బీచ్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు.విజయనగరం జిల్లాలో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణం నిజంగా అద్భుతమైన ఆలోచన. ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని జీవితాంతం రుణపడి ఉంటాం. ఈ జెట్టీ నిర్మాణం వల్ల మత్స్యకారుల బతుకులు మారతాయి. మా ప్రాణాలకు రక్షణ లభిస్తుంది. ఉపాధి అవకాశాలు ఎన్నోరెట్లు పెరుగుతాయి. దశలవారీగా ఇక్కడ ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మిస్తే, మరింత ప్రయోజనం చేకూరుతుంది.` బర్రి చిన్నప్పన్న, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షులు, ఫిష్‌ కోపెడ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌

Leave a comment

Your email address will not be published. Required fields are marked *