ట్రబుల్‌ ఐటీ.. సేమ్‌ 2 సేమ్‌

తలమానికంగా చెప్పుకునే బాసర ట్రిబుల్‌ ఐటీలో ఏం మార్పు రాలేదు.. 12డిమాండ్లు, సమస్యల సాధన కోసం వారం రోజుల పాటు విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.. ఫలితంగా విద్యాశాఖ మంత్రి వచ్చి చర్చలు జరుపగా.. నెల రోజుల్లో సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పిన మాట.. హావిూలుగానే మిగిలిపోయాయి.. రెగ్యులర్‌ వీసీ బదులుగా.. ఇంచార్జి వీసీ వచ్చారు తప్ప.. మిగతా డిమాండ్లను పరిష్కరించలేదు.. రూ.12 కోట్లు మంజూరు చేయగా.. మరమ్మతులు చేపడుతున్నారు.. మిగతా సమస్యలను పట్టించుకోకపోగా.. నెల రోజుల గడువు ముగిసింది.. తాజాగా విద్యార్థులకు సెలవులు ప్రకటించగా.. పరీక్షల నేపథ్యంలో తాత్కాలికంగా ఆందోళన వాయిదా వేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని స్టూడెంట్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ పేర్కొంటోంది..!తెలంగాణలోనే ఏకైక ప్రముఖ విద్యా సంస్థ.. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)ని 2008లో నిర్మల్‌ జిల్లా బాసరలో ఏర్పాటు చేశారు. గతంలో 2 వేల సీట్లతో ప్రారంభించగా.. 2010లో ఏటా వెయ్యి సీట్లకు పరిమితం చేయగా.. 2019లో 500సీట్లు పెంచటంతో అప్పటి నుంచి 1500 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. పదో తరగతి పూర్తయ్యాక.. ఆరేళ్ల కోర్సు కోసం (ఇంటర్‌ మరియు ఇంజనీరింగ్‌) ప్రవేశాలు కల్పిస్తుండగా.. 8 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇలాంటి సంస్థకు ఇంచార్జి వీసీ, అధికారులతో ఎనిమిదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతుండగా.. ఇటీవల విద్యార్థులు వారంపాటు ఆందోళన చేయగా.. విద్యార్థి సంఘాలతో పాటు అన్ని పార్టీల అధ్యక్షులే బాసర బాట పట్టి విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. విద్యార్థుల అసమాన పోరాట స్ఫూర్తితో సర్కారు దిగిరాగా.. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హావిూ ఇచ్చారు.విద్యాశాఖ మంత్రి హావిూ ఇచ్చి నెల రోజులు గడిచినా.. సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు 12 డిమాండ్లతో ఆందోళన చేయగా.. రెగ్యులర్‌ వీసీ బదులు ఇంచార్జి వీసీ, డైరెక్టర్‌ నియామకం మాత్రమే చేపట్టారు. ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేయగా.. లోపల డ్రైనేజీ వ్యవస్థ, ప్లంబింగ్‌ వర్క్స్‌, వివిధ మరమ్మతులు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మిగతా డిమాండ్లు, సమస్యలపై స్పందన లేకుండా పోయింది. ఇంచార్జి వీసీగా ప్రొ. వెంకట రమణను, డైరెక్టరుగా సతీశ్‌ కుమార్‌ ను నియమించారు. విద్యార్థులకు ల్యాప్‌ టాప్ల కొనుగోలు, లెక్చరర్ల నియామకం చేపట్టలేదు. మెస్‌ టెండర్లు రద్దు చేసి.. కాంట్రాక్టు సంస్థను మార్చాలని డిమాండ్‌ చేయగా.. ఈ నెల 24లోగా మారుస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు. విడతల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెబుతుండగా.. ఇందుకు స్టూడెంట్లు, స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (ఎస్జీసీ) ఒప్పుకోవటం లేదు.తాజాగా ఇంజనీరింగ్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జూలై 23 నుంచి మాసిక పరీక్షలు, పీయూసీ విద్యార్థులకు జులై 26 నుంచి ల్యాబ్‌ పరీక్షలు ఉన్నందున తాత్కాలికంగా వాయిదా వేశారు. సమస్యలు పరిష్కారం కాకపోవటంతో.. విద్యార్థులు మళ్లీ శనివారం నుంచి ఆందోళన బాట పట్టారు. ఇంతలో ట్రిబుల్‌ ఐటీ అధికారులు విద్యార్థులకు శనివారం నుంచి 31వరకు సెలవులు ప్రకటించారు. సెమిస్టర్‌ బ్రేక్‌ సందర్భంగా మూడు రోజుల పాటు సెలవులు ఇస్తుండగా.. ఈసారి 9రోజులు సెలవులు ఇచ్చారు. శనివారం రోజు పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో అధికారులు సమావేశమై చర్చించారు. సెలవుల తర్వాత తిరిగొచ్చే విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొనబోమని పేరెంట్స్‌ నుండి మౌఖిక హావిూ తీసుకున్నట్లు తెలిసింది. ట్రిబుల్‌ ఐటీ విద్యార్థుల ఉద్యమాన్ని అణిచి వేసేందుకు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుండగా.. అసలు విషయం బయటకు పొక్కకుండా అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున ఆటంకం కలగవద్దనే ఉద్దేశ్యంతోనే ఆందోళన వాయిదా వేశామని.. సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఎస్‌ జీ సీ చెబుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *