పులి కాదు చిరుత

విజయనగరం, సెప్టెంబర్‌ 7
విజయనగరం జిల్లా రాజం మండలం భయం గుప్పిట్లో ఉంది. పెద్దపులి సంచరిస్తుండడంతో ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే పులి పాదముద్రల్ని గుర్తించిన ఫారెస్ట్‌ అధికారులు.. మొగిలివలస, పొగిరి, అంతకాపల్లి, పొనిగిటివలస గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లొద్దని.. అవసరం అయితే ఎవరినైనా వెంట బెట్టుకెళ్లాలని దండోరా వేయించారు. ప్రజలంతా సాయంత్రం కల్లా ఇళ్లకు చేరాలన్నారు. ఈ ప్రాంతాల్లో సంచరిస్తోంది రాయల్‌ బెంగాల్‌ టైగరేనని అనుమానిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ ప్రాంతాల్లో కేవలం పులి మాత్రమే కాకుండా చిరుత కూడా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకాపల్లి పంటపొలాల్లో పాదముద్రలు సేకరించిన ఫారెస్ట్‌ సిబ్బంది.. బెంగాల్‌ రాయల్‌ టైగర్‌తో పాటు చిరుత కూడా తిరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. నెలరోజులకి పైగా చిక్కకుండా దొరక్కుండా తిరుగుతున్న పెద్దపులి మూగజీవాలపై పంజా విసురుతూనే ఉంది.ఈ మధ్య బొండపల్లి మండలం కర్రివాని వలసలో ఆవుపై దాడి హతమార్చింది. అంతకుముందు దత్తిరాజేరు మండలం యస్‌. చింతలవలసలో కూడా పులి ఆనవాళ్లు కనిపించాయి. అయితే పులి లేదంటే చిరుత సంచారంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని బంధించాలని అధికారులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *