మీరు నాకు పెద్ద సమస్యే సృష్టించారంటూ బైడెన్ ఛలోక్తి

ప్రపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన నేతల్లో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఒకరని ఇప్పటివరకూ పలు సర్వేలు చెప్పగా, ఇప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ (Joe Biden) సైతం మోదీ ఆటోగ్రాఫ్ అడిగారట. ఈ ఆసక్తికరమైన సంఘటన జీ-7 శిఖరాగ్ర సదస్సు (G7 Summit) కోసం మోదీ హిరోషిమా రాక సందర్భంగా వివిద దేశాధినేతలతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో చోటుచేసుకుంది.

జో బైడెన్ తాను ఎదుర్కొంటున్న ఓ సవాలును మోదీ ముందు ప్రస్తావించారు. బైడన్ ఆహ్వానం మేరకు జూన్‌లో మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ హాజరయ్యే కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని, తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని బైడన్ తన సంభాషణల్లో మోదీతో చెప్పారట. పరిచయం లేని వాళ్లు సైతం ఫోన్లు చేసి మోదీని కలుసుకునే అవకాశం కల్పించారని కోరుతున్నట్టు చెప్పారుట. ”మోదీజీ…మీరు నిజంగానే నాకు పెద్ద సమస్య సృష్టించారు” అని చెబుతూ, నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలంటూ సరదాగా వ్యాఖ్యానించారట.

ఈ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగా అక్కడకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అంటోని అల్బనీస్ (Anthony Albanese) సైతం తాను కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్టు మోదీ దృష్టి తెచ్చారట. సిడ్నీలో మోదీ పాల్గొనే సమావేశంలో పాల్గొనెందేకు తమకు కూడా అవకాశం కల్పించాలని చాలా మంది వ్యక్తిగత సందేశాలు పంపుతున్నట్టు ఆయన మోదీ దృష్టికి తెచ్చారట. మోదీ పాల్గొనే సభా వేదిక 20,000 మందికి ఆతిథ్యం ఇస్తుందని, ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయని, అయినప్పటికీ తనకు వచ్చే విజ్ఞప్తులు మాత్రం ఆగలేదని ఆయన మోదీకి చెప్పుకొచ్చారట. అటు బెడెన్, ఇటు అల్బనీస్ తాము ఎదుర్కొంటున్న సవాళ్లను మోదీతో చెబుతున్నప్పుడు మోదీ చిరునవ్వులు చిందించారట. ఈ సంభాషణలు ఆసక్తిగా విన్న కొందరు ఈ విషయాన్ని ముచ్చటించుకోవడంతో మీడియా వరుస కథనాలు గుప్పిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *