చెన్నై గెలిచింది ఓకే.. కానీ అలా జరిగితే ఇంకా బాగుండేది

ఐపీఎల్ 2023 సీజన్ కూడా ముగిసింది. ఎన్నో అంచనాలతో ఈ సీజన్ ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఫైనల్ మ్యాచ్‌లో చతికిలపడింది. రవీంద్ర జడేజా హీరో ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును సమం చేసింది.ఈ మ్యాచ్‌లో చెన్నై అద్భుతమైన విజయం సాధించడంతో తొలిసారి కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. విన్నింగ్ రన్స్ చేసిన జడేజాను గాల్లోకి ఎత్తుకొని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఇలా చెన్నై జట్టు కప్పు గెలిచినందుకు తనకు సంతోషంగానే ఉందని , కానీ ఒక విషయం మాత్రం చాలా బాధగా ఉందని టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ తెలిపాడు.

‘ఈ మ్యాచ్‌లో విన్నింగ్ రన్స్ కనుక ధోనీ చేసి ఉంటే.. అది ఇంకా బాగుండేది. అయితే అతను టీం ప్లేయర్ కనుక బాగానే సంతోషిస్తాడు. అతను తొలి బంతికే ఈ మ్యాచ్‌లో అవుటయ్యాడు. కానీ మనం గెలవడమే ముఖ్యం కదా. మనం సెంచరీ చేసినా, ఐదు వికెట్లు తీసుకున్నా టీం ఓడిపోతే వేస్ట్. కానీ మనం సున్నా పరుగులకే అవుటైనా లేదంటే 40-50 పరుగులు చేసి, టీం గెలిస్తే అది చాలా గొప్ప’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 22 పరుగులు అవసరమైన సమయంలో ధోనీ క్రీజులోకి వచ్చాడు. అయితే ఫైనల్‌లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన అతను.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో తను ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. ధోనీ కనుక మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే అది ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *