ఏపీలో చిన్నమ్మ మార్క్‌ పాలిటిక్స్‌

విజయవాడ, ఆగస్టు 10
ఏపీ బీజేపీ రథసారథి దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాలపై ఫోకస్‌ పెట్టారా? అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి పార్టీపై తన ముద్ర వేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారా? ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన పురంధేశ్వరి ఇక ప్రత్యక్ష పోరుకు సై అంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాజకీయాల్లో దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కేంద్రమంత్రిగా ఆమె మార్కు రాజకీయం చేశారు. రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పురంధేశ్వరి అనర్గళంగా మాట్లాడటంలో దిట్ట. అంతేకాదు అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగిన పురంధేశ్వరి అవే ఆయుధాలతో ఇక వైసీపీ ప్రభుత్వంపై అమితువిూకి సై అంటున్నారు. ఇప్పటికే ఏపీ అప్పులపై నిలదీస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి ఇక వ్యవస్థలకు అండగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలుత పంచాయతీ సర్పంచ్‌లతో కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరుబాటకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు.. గ్రామ పంచాయితీల నిధులను స్వాహా చేస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీయడానికి పురంధేశ్వరి రెడీ అవుతున్నారు.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళన తెలిపారు. సర్పంచ్‌లు చేపట్టబోయే కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లోకి వెళ్లేలా స్కెచ్‌ వేశారు. పంచాయితీల నిధులను స్వాహాచేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని బీజేపీ వాదిస్తుంది. ఇదే అంశంపై దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర స్ధాయిలో నాలుగు జోన్‌ లలో నిర్వహించిన బీజేపీ జోనల్‌ సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వ వైఖరి పై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. గాంధీమహాత్ముడు కలలుకన్న గ్రామస్వరాజ్యం రావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోంది అని పురంధేశ్వరి ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితిలు ఏర్పడుతున్నాయని మండిపడ్డారు. సర్పంచ్‌ల హక్కుల సాధన కై పోరుబాట పడుతున్నామని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన కార్యక్రమాలకు పురంధేశ్వరి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కసరత్తు సైతం మె?దలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నేతలు, కోర్‌ కమిటీ సభ్యలుతో ఆడియో, వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించిన దగ్గుబాటి పురంధేశ్వరి కార్యక్రమం విజయవంతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనలకు వక్తలను దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర నేతలు అందరూ జిల్లా కేంద్రాలలో నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొనే విధంగా ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. కలెక్టరేట్‌ ఆందోళనల్లో ఒంగోలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వయంగా పాల్గొంటారు. అలాగే విజయవాడలో మాజీ కేంద్రమంత్రి వై సుజనా చౌదరి, అరకులో మాజీ ఎంపి కొత్తపల్లి గీత, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, విశాఖపట్నంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్‌, అనకాపల్లి లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కాకినాడలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ , మచిలీపట్నంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుసాంబశివరావు, గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నెల్లూరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, తిరుపతిలో బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, హిందుపూరంలో ఏపీ కో ఇన్‌ చార్జి సునీల్‌ దియోధర్‌, కర్నూలులో మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌, నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే ఎం ఎస్‌ పార్ధసారధిలు పాల్గొనాలని పురంధేశ్వరి ఆదేశించారు. అంతేకాదు ప్రతి జిల్లా కేంద్రానికి ఒక ప్రముఖ సీనియర్‌ బీజేపీ నేతలు హాజరయ్యే విధంగా పురంధేశ్వరి కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమాల్లో పురంధేశ్వరి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తుంటే ఇకపై బీజేపీని ప్రజల దగ్గరకు చేరేందుకు పురంధేశ్వరి కసరత్తు చేస్తున్నారని ఇక అంశం దొరికితే పోరుబాట తప్పదనే సంకేతాన్ని వైసీపీ అధిష్టానానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాజకీయాల్లో చిన్నమ్మ మార్క్‌ పాలిటిక్స్‌ స్టార్ట్‌ చేశారని ఇక దబిడి దిబిడేనంటున్నారు బీజేపీ కార్యకర్తలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *