31కిలోవిూటర్లు…36 నెలలు…

హైదరాబాద్‌, ఆగస్టు 18
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టు పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. నిర్ణీత గడవులోగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. రాయదుర్గం నుంచి ఎయిర్‌ పోర్టు వరకు 31 కిలోవిూటర్ల మేర ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ సంస్థ దక్కించుకుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రదటన వెలువడనుంది. రాయదుర్గం ` ఎయిర్‌ పోర్టు మార్గం నిర్మాణానికి 13 అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి ఎల్‌ అండ్‌ టీతో పాటు ఎన్సీసీ సంస్థ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు సంస్థలు రూ.5,668 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చాయి.దీంతో నిర్మాణ రంగంలో ఉన్న అపారమైన అనుభవం, మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అర్హతలు, ప్రామాణికత, నైపుణ్యమున్న మానవ వనరులు, యంత్రాలు, నిర్మాణ పద్ధతులు, వివిధ రంగాల్లో ఇప్పటి వరకు పూర్తి చేసిన నిర్మాణాలు, ఎయిర్‌ పోర్టు మెట్రో నిర్మాణంలో అనుభవాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరికి ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌ అండ్‌ టీ సంస్థను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు.ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో 72 కిలో విూటర్ల మెట్రో రైల్‌ మార్గాన్ని నిర్మించింది ఎల్‌ అండ్‌ టీ సంస్థ. దీంతో ప్రతిష్టాత్మకమైన ఎయిర్‌ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టును కూడా ఎల్‌ అండ్‌ టీ కే అప్పగించనుంది. మరోవైపు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు మొత్తం 31 కిలోవిూటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో మెట్రో రైల్‌ కోసం ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే నెల (సెప్టెంబరు)లో పనులు ప్రారంభించాలని, పనులు ప్రారంభించిన నాటి నుంచి 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు.రాయదుర్గం ` శంషాబాద్‌ మార్గంలో ఇప్పటికే అలైన్‌ మెంట్‌ పూర్తయింది. పెగ్‌ మార్కింగ్‌, భూసార పరీక్షలు కూడా అయిపోయాయి. అధికారికంగా ప్రకటన వెలువడగానే నిర్మాణ సంస్థకు పనులు అప్పగించనున్నారు. సెప్టెంబరులోనే పనులు చేపట్టనున్నారు. 31 కిలోవిూటర్ల ఎయిర్‌పోర్టు మార్గంలో 29.3 కిలోవిూటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌, మరో 1.7 కిలోవిూటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ లైన్లు నిర్మించనున్నారు. డిజైన్‌, బిల్ట్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో మొదటి దశ మెట్రోను నిర్మించారు. అయితే ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే చేపట్టనున్నారు. కాబట్టి దీనిని ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రాజెక్టును చేజిక్కించుకున్న సంస్థే ఎలివేటెడ్‌ వయాడక్ట్‌ తో పాటు ఇంజినీరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ పనులు చేపడుతుంది. ట్రాక్స్‌, రోలింగ్‌ స్టాక్‌, విద్యుత్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, ఆటోమేటిక్‌ ఫేర్‌ సిస్టమ్‌ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *