మునుగోడులో పోటీకి రాజగోపాల్‌ రెడ్డి దూరం…?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ ను పెంచేసింది. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్న తరుణంలో మునుగోడు ఉపఎన్నిక అంశం తెరపైకి రావడంతో రాజకీయ పార్టీల సవిూకరణాలన్నీ మారిపోయాయి. రాజగోపాల్‌ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని ఆమోదించకముందే.. అన్నీ రాజకీయ పార్టీలు ఉపఎన్నికలో ఏం స్ట్రాటజీ ప్లే చేయాలి..? అభ్యర్థిని ఎలా సెలెక్ట్‌ చేయాలి..? క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల బలబలాలు ఏంటి..? తదితర విషయాలన్నింటినీ తెలుసుకునేందుకు ఇప్పటికే సర్వే సంస్థలను రంగంలోకి దించాయి. దీనికితోడు పర్సనల్‌గా సర్వేలు చేయడం.. వారి వర్గాల ద్వారా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించడంలో ఇప్పటికే టికెట్‌ ఆశిస్తోన్న నేతలు మునిగిపోయారు.ఇదంతా ఇలావుంటే.. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలో ఈసారి బీసీ సామాజిక వర్గానికే టికెట్‌ కేటాయించాలనే డిమాండ్‌ రోజురోజూకీ పెరిగిపోతోంది. బీసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నుంచి సైతం బీసీలకే టికెట్‌ కట్టబెట్టాలనే ప్రతిపాదనను మెల్లగా తెరపైకి తీసుకొస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2.20 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఇందులో బీసీ ఓట్ల శాతం దాదాపుగా 1.40 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నట్టు సమాచారం. దీనికితోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పొలిటికల్‌ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాయి. దీంతో ఈసారి ఎలాగైనా అన్ని పొలిటికల్‌ పార్టీలు బీసీ అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ తెరపైకి వచ్చింది.మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైతే.. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన పార్టీలు పోటీ చేసినా.. ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది తెలియాల్సి ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మునుగోడు టికెట్‌ ఆశించే బీసీ సామాజిక వర్గ నేతల్లో కర్నాటి విద్యాసాగర్‌, కర్నె ప్రభాకర్‌, నారబోయిన రవి, బూర నర్సయ్యగౌడ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే కాంగ్రెస్‌ పార్టీ విషయానికొస్తే.. పల్లె రవి, పున్న కైలాష్‌ నేత, చెరుకు సుధాకర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఆయన పోటీ చేయకపోవచ్చేమోనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవంగా చూసినా.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీసీ ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొలిటికల్‌ పార్టీలు ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిత్వం విషయంలో అన్ని పొలిటికల్‌ పార్టీలు ఏం స్ట్రాటజీ ప్లే చేస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. బీసీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చి.. ఆ వర్గం ఓట్లను క్యాష్‌ చేసుకుంటారా..? లేదా..? రెడ్డి సామాజికవర్గానికి ఇస్తారా..? అన్న ఆసక్తి లేకపోలేదు. అయితే బీసీ సామాజికవర్గానికి చెందిన నేతల్లో ఆర్థికంగా బలంగానే లేరనే చర్చను వ్యతిరేక వర్గాలు తేరపైకి తీసుకొస్తున్నాయి. ఉపఎన్నిక అంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, అంతటి ఖర్చును బీసీ నేతలు ఎదుర్కొంటారా…? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పొలిటికల్‌ పార్టీలను డైలామాలో పడేస్తుండడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *