టీ కాంగ్రెస్‌ లో కోవర్టుల వ్యవహారమా..?

టి కాంగ్రెస్‌లో కోవర్టుల వ్యవహారం మళ్లీ తెర విూదకు వచ్చింది. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రెండో రోజే.. ఈ విషయంలో సీరియస్‌గా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టులు వెంటనే బయటికి వెళ్లిపోవాలని వార్నింగ్‌ ఇచ్చారాయన. అప్పట్లో ఆ కామెంట్స్‌ పెద్ద ఎత్తున దుమారం రేపాయి. వాళ్ళెవరో తేల్చమని జగ్గారెడ్డి లాంటి నాయకులు డిమాండ్‌ చేశారు. సొంత పార్టీ నేతలను డ్యామేజ్‌ చేస్తావా అంటూ మరికొందరు చిర్రు బుర్రులాడారు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా గాంధీభవన్‌ విూటింగ్‌లో కోవర్టుల అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు రేవంత్‌. అయితే ఈసారి మాత్రం పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరని ప్రకటన చేశారు . అంటే.. దీని అర్థం ఏంటి? అన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. తాను పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యాక కోవర్ట్‌లంతా పార్టీ నుంచి వెళ్ళిపోయారనా? లేక వెళ్ళిన వాళ్ళలో అలాంటి వారు ఉన్నారనా? అన్న డౌట్స్‌ పెరుగుతున్నాయి..సాధారణంగా రేవంత్‌రెడ్డి తాను చేసిన ఆరోపణలపై మెట్టు దిగరు. కానీ ఇటీవల ఆయన దిగే పనిలోనే ఉన్నారు. కోవర్టుల విషయంలో కూడా అలాగే ఒక మెట్టు దిగినట్టు చెబుతున్నారు. తన కామెంట్స్‌ని పార్టీలో కొంతమంది నాయకులు ఉద్దేశ్యపూర్వకంగానే వివాదం చేస్తున్నారన్నది రేవంత్‌ అభిప్రాయం అట. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నందున నాయకులు అందర్నీ కలుపుకొని పోవాలన్న ఆలోచనలో భాగమే తాజా ప్రకటన అని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీని ప్రియాంక గాంధీనే నేరుగా పర్యవేక్షించబోతున్నారు. దీంతో ఇష్టం ఉన్నా? లేకున్నా?అందర్నీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడి విూద ఉంటుంది. అందుకే ఆయనలో మార్పు వచ్చిందన్న మరో వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు మిగతా నాయకులు కలిసి వస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. కలవని వారిని సైతం బుజ్జగించుకుని వెంటబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకత్వం విూదే ఉంటుందన్నది మెజార్టీ నేతల అభిప్రాయం.కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల మధ్య సమన్వయ లోపం అనేది తెరవిూదకు వచ్చింది. పార్టీలో నాయకులంతా కలిసి పని చేస్తే గెలుపు పెద్ద సమస్య కాదు అనేది కర్ణాటకలో తేలిపోయింది. నాయకులు మధ్య అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా పార్టీని గెలిపించే విషయంలో అందరూ ఏకం కావాలి అన్నది మౌలికమైన అంశం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులంతా ఐక్యతా రాగమే ఆలపిస్తున్నారు. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్‌ తన పాత శైలిలోనే ఉంటే ఇబ్బందులు తప్పవు. అందుకే ఆయన పంతం వీడి దిగివస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి గాంధీభవన్‌ వర్గాలు. దీనికి తోడు పార్టీలో ఒకరిద్దరు సీనియర్‌ నేతలు రేవంత్‌ మాటల్ని, వాటితో వచ్చే సమస్యలను అధిష్టానం దగ్గర భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారనేది ఆయన సన్నిహితుల అంచనా. అలాంటి వారికి అవకాశం ఇవ్వడం ఎందుకన్న ఆలోచనతోనే పీసీసీ ప్రెసిడెంట్‌ వైఖరి మార్చుకున్నారట. మొత్తంగా కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వాతావరణం కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *