గులాబీపై ముప్పేట దాడి…

గులాబీ పార్టీకి రాబోయే రోజుల్లో మరింత గడ్డుకాలం రానుందా?. టీఆర్‌ఎస్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ ఓ వైపు దాడి చేస్తుంటే మరో వైపుసొంత పార్టీకి చెందిన అసంతృప్తులు చేస్తున్న కామెంట్స్‌ మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో పార్టీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని బీజేపీ చెబుతుంటే, టీఆర్‌ఎస్‌ను వీడుతున్న వారు చేస్తున్న కామెంట్స్‌ టీఆర్‌ఎస్‌లో లుకలుకలను బయటపెడుతున్నాయనే చర్చ తెరపైకి వస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ నుండి బహిష్కరణకు గురైన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, పార్టీని వీడిన ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీఆర్‌ఎస్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆరోపించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, అధిష్టానాన్ని కలిసి తన గోడును చెప్పుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకే ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ లేకుంటే ఇక తమలాంటి వారు పార్టీలో జరుగుతున్న అన్యాయాలను ఎవరితో చెప్పుకుంటామని అన్నారు. పార్టీలో కేటీఆర్‌ వర్గానికి పదవులు కట్టబెడుతున్నారని, మంత్రి హరీష్‌ రావు వర్గాన్ని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఉద్యమ కాలం నుండి పార్టీలో కొనసాగి.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మాదేవేందర్‌ రెడ్డి లాంటి సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదని అన్నారు. కేటీఆర్‌ పాత్రను పెంచడానికి హరీశ్‌ రావు వర్గానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతున్నాయి.బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ప్రజా తీర్పు కోసం ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు. పార్టీ మారి వచ్చిన వారిలో కొందరు మంత్రి పదవుల్లో కొనసాగుతుండటంతో ఈటల సవాల్‌ ఆసక్తిని రేపుతోంది. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ నుండి పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌ పై గులాబీ పార్టీలో పెద్ద చర్చకు కారణం అవుతోంది. పార్టీలో ఎవరెవరూ ‘ఏక్‌ నాథ్‌ షిండే’లు ఉన్నారనేదానిపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఫోకస్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఈటల ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డి ఇద్దరూ పార్టీ మారడానికి ముందు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఇక ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై ఒత్తిడి తీసుకువచ్చేలా బీజేపీ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చివరకు పార్టీ అధినేత కేసీఆర్‌ డిఫెన్స్‌లో పడేలా చేయడం బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కేసీఆర్‌ పై అన్ని వైపుల నుండి ఒత్తిడి తీసుకువచ్చేలా పావులు కదులుతున్నాయనేది స్పష్టం అవుతోంది. పార్టీ మారి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులపై బీజేపీ ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తుంటే పార్టీలోని అసంతృప్తులో టీఆర్‌ఎస్‌లో ఉన్న అంతర్గత విషయాలపై బహిరంగంగానే నోరు విప్పేందుకు సిద్ధం అవుతున్నారు. నర్గాపూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంత్రి కేటీఆర్‌కు హరీష్‌ రావుకు మధ్య వర్గ పోరు ఉందని కామెంట్స్‌ చేయగా వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు తనకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తన విషయంలో వస్తున్న ఆరోపణలపై హరీష్‌ రావు గతంలోనే స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలో తన పట్ల వివక్ష జరుగుతోందనే ప్రచారంపై హరీష్‌ రావు స్పందిస్తూ.. తామంతా టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ ఉన్నంత వరకు రాష్ట్రంలో గులాబీ పార్టీనే అధికారంలో ఉంటుందని చెప్పారు. అయినా సరే మరోసారి కేటీఆర్‌కు హరీశ్‌ రావుకు మధ్య గ్యాప్‌ ఉన్నట్లు ప్రచారం జరగడం హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ సమస్యలకు అధినేత కేసీఆర్‌ ఎలా పరిష్కారం చూపుతారనేది పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *