వన్డే వరల్డ్‌కప్‌లో.. 9 మ్యాచ్‌లు రీషెడ్యూల్‌

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌క్‌పకే హైలైట్‌గా నిలిచే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేశారు. ముందుగా ప్రకటించినట్టు ఇండో-పాక్‌ మ్యాచ్‌ అక్టోబరు 15న కాకుండా ఓ రోజు ముందుగా (14న) నిర్వహించనున్నట్టు ఐసీసీ బుధవారం ప్రకటించింది. మెగా టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేయగా.. మిగిలిన మ్యాచ్‌లు గతంలో వెలువరించిన షెడ్యూల్‌ ప్రకారమే జరగనున్నట్టు ఐసీసీ తెలిపింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్లకు సంబంధించి మూడేసి మ్యాచ్‌లు (తేదీలు లేదా సమయం), భారత్‌ రెండు మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకొన్నాయి. నవంబరు 11న నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను ఓ రోజు ఆలస్యంగా 12న బెంగళూరులో నిర్వహించనున్నారు. అక్టోబరు 15 నుంచి దసరా నవరాత్రులు మొదలవ నున్న నేపథ్యంలో తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో.. దాయాదుల మ్యాచ్‌ను ఓ రోజు ముందుకు జరిపారు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు తగిన సమయం లభించేందుకు హైదరాబాద్‌లో అక్టోబరు 12న లంకతో పాక్‌ ఆడాల్సిన మ్యాచ్‌ను రెండ్రోజులు ముందుకు.. అంటే 10వ తేదీకి రీ షెడ్యూల్‌ చేశారు. ఇదే రోజు ధర్మశాలలో బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను డే మ్యాచ్‌గా మార్చారు. అంతేకాకుండా నవంబరు 12న ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌, పాక్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను 11న నిర్వహిస్తారు. అక్టోబరు 5న వరల్డ్‌కప్‌ మొదలవనుండగా.. నవంబరు 19న ఫైనల్‌ జరగనుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *