గృహలక్ష్మి గైడ్‌ లైన్స్‌ ఇవే

తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షల నగదు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. అయితే, తాజాగా ఈ గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రోడ్లు, భవనాల శాఖ విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్‌ 25ని విడుదల చేసింది.
గృహలక్ష్మి పథకంలోభాగంగా కట్టుకొనే ఇల్లు మహిళ పేరు విూదనే ఉండాలి. లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్‌ తో ఇల్లు కట్టుకోవచ్చు. ఈ పథకం పొందిన ఇంటిపై గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయాలి. గృహలక్ష్మి పొందాలంటే సంబంధిత కుటుంబం ఫుడ్‌ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలి. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం అమలు చేస్తారు. రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నట్లు మార్గదర్శకాల్లో తెలిపారు.పథకం కింద లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని ఒకేసారి కాకుండా 3 సార్లుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇంటి బేస్‌ మెంట్‌ లెవల్‌, రూఫ్‌ లెవల్‌, ఇలా మూడు దశల్లో సాయం జమ చేస్తారు. ఇందుకోసం లబ్దిదారు మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్‌ ధన్‌ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకోసం వినియోగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్దిదారులను ఎంపిక చేయాలని జీవోలో పేర్కొన్నారు.రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అనేది బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇళ్ల చొప్పున, మొత్తం 4 లక్షల కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడం సీఎం కేసీఆర్‌ ఆశయం అని, గృహలక్ష్మి పథకం పేదలకు అందిస్తున్న వరం అని చెప్పారు.మార్చి 9న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గృహలక్ష్మి పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకొని అప్పుడే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4 లక్షల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులను కూడా కేటాయించింది. పథకాన్ని జులై నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *