ధర్మపురి దారెటు..

తెలంగాణలో రాజకీయ సవిూకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీయే టార్గెట్‌ గా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ మాజీ రాజ్యసభ సభ్యుడు, రాజకీయ కుర వృద్ధుడు డి.శ్రీనివాస్‌ ఇంటికి వైఎస్‌ఆర్‌ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వెళ్లడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇవాళ షర్మిల డీఎస్‌ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్‌ తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్న డీఎస్‌.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పారని, అలాగే భవిష్యత్‌ లో షర్మిల కూడా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీగా కాంగ్రెస్‌ పార్టీలో చక్రం తిప్పిన డీఎస్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరారు. 2018లో ఎన్నికలకు ముందు ఆయనపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు అధినేత కేసీఆర్‌ కు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ విషయంలో వివరణ ఇచ్చుకునేందుకు అపాయింట్మెంట్‌ కోరినా కేసీఆర్‌ నిరాకరించారనే ప్రచారం జరిగింది. దాంతో అప్పటి నుండి ఆయన టీఆర్‌ఎస్‌ కు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ సారి బీజేపీ ముఖ్య నేత అమిత్‌ షాతో, ఓ సారి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఆ సందర్భాల్లో డీఎస్‌ పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆయన మాత్రం సైలెంట్‌ గా ఉండిపోయారు. తన రాజ్యసభ పదవీకాలం గడువు ఇటీవలే ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో డీఎస్‌ రాజకీయ భవిష్యత్‌ పై తిరిగి ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే డీఎస్‌ చిన్నకుమారుడు ధర్మపురి అర్వింద్‌ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ కాంగ్రెస్‌ లో ఉన్నారు. దీంతో డీఎస్‌ రాజకీయ ప్రయాణం ఎటువైపు అనే చర్చ జోరుగా సాగుతున్న క్రమంలో అకస్మాత్తుగా షర్మిల డీఎస్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.ఈ భేటీలో షర్మిల సీఎం అవుతారని చెప్పడంపై రాజకీయ వర్గాల్లో కొత్త విశ్లేషణలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ ను కాదని డీఎస్‌ షర్మిల పార్టీలో చేరుతారా? అనే టాక్‌ తాజాగా తెరపైకి వస్తోంది. ఈ భేటీలో కేవలం ఆరోగ్య విషయంలో పరామర్శ వరకే జరిగిందా? లేక డీఎస్‌ ను కలిసి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారా? అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. డీఎస్‌ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రభావం చూపకపోయినా.. ఆయన సలహాలు, సూచలను పార్టీకి ఉపయోగపడతాయనే ఆలోచన కాంగ్రెస్‌ చాలా కాలంగా చేస్తోందనే ప్రచారం ఉంది. తెలంగాణ రాజకీయాలపై డీఎస్‌ కు మంచి పట్టు ఉంది. ఈ క్రమంలో ఇటీవల షర్మిల పార్టీ విషయంలో అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ కు తెలంగాణలో ఉన్న అభిమానం షర్మిల పార్టీకి కలిసి రానుందనే అంచనాలతో వైఎస్‌ఆర్టీపీ ఏమేరకు తమకు డ్యామేజ్‌ చేస్తుందనే చర్చలు ఆయా పార్టీల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్‌, షర్మిల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *