ఐ ప్యాక్‌ లో ముగ్గురు మాజీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నివేదికలు చెప్పించుకుంటూ అభ్యర్థుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సవిూక్ష నిర్వహించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇందులో 15 మంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని తేలినట్టు పేర్కొన్నారు. పనితీరు సరిగ్గా లేని వారికి వ్యక్తిగతంగా రిపోర్టులు పంపి, వారితో మాట్లాడతానని, అప్పటికి వారి పనితీరు మారకపోతే టికెట్లు ఇవ్వలేనని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అయితే వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పనితీరు బాగోలేదు అని చెప్పిన ఎమ్మెల్యేలలో మాజీ మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్క్‌ షాప్‌ లో కొంతమందికి టికెట్లు అనుమానమేనని ముందుగానే తేల్చేశారు సీఎం జగన్మోహన్‌ రెడ్డి అయితే ఆ పదిహేను మందిలో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని, పేర్ని నాని పేర్లు ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోసం ప్రతిపక్ష టీడీపీని, జనసేనను, బీజేపీని తూర్పారబట్టే ముగ్గురు మాజీ మంత్రుల పేర్లు ఈ లిస్టులో ఉండటం నిజంగా వారికి షాక్‌ అనే చెప్పాలి.. ప్రతిపక్ష పార్టీలపై చీటికిమాటికి విరుచుకు పడే ఈ ముగ్గురు మాజీ మంత్రులు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి టికెట్‌ ఇవ్వకపోతే ఏ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి. టికెట్‌ ఇవ్వకుంటే, మంత్రులుగా పనిచేసిన వీరు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లో ఇమడలేని పరిస్థితి. దీంతో తాజా పరిణామాలతో వీరికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ప్రజా క్షేత్రంలో పని చేసి ప్రజల మద్దతు పొందితే ఆలోచిస్తానని సీఎం జగన్‌ చెప్తున్నా వీరికి ప్రజా మద్దతు దొరుకుతుందా? అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఏది ఏమైనా జగన్మోహన్‌ రెడ్డి కోసం ఏమైనా చేస్తామని చెప్పే వీరు, సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే ఏం చేస్తారు? సైలెంట్‌ గా ఉంటారా లేక పక్క చూపులు చూస్తారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *