పాపం… ధర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ

వైసీపీలో విశ్వాసంగా పని చేసిన వారిని పార్టీకి దూరం చేయడం జగన్‌ నైజంగా కనిపిస్తోంది. థర్టీ యియర్స్‌ యిండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్‌ నుంచి తాజాగా మాజీ మంత్రి బాలినేనికి పార్టీలో ఎదురౌతున్న పరిస్థితి వరకూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అంతేనా దశాబ్దాల పాటు కాపాడుకున్న నిజాయితీని తాకట్టు పెట్టి మరీ జగన్‌ కోసం పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ఆయన యిచ్చిన మర్యాదను కూడా ఉదాహరణగా చూపవచ్చు. ముందుగా థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వి గురించి చెప్పుకుంటే.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన, కొద్ది కాలం పాటు ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అ ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం, తన స్థాయిని మించి కష్ట పడ్డారు. కష్టపడటం అంటే జగన్మోహన్‌ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ, ఆయన ప్రత్యర్థులను యిష్టారీతిగా తిడుతూ ఉండటమే. ఆయన అదే పని చేస్తూ అప్పట్లో ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ టార్గెట్‌ గా విమర్శలు గుప్పించారు. అదే ప్రచారమనుకున్నారు. నోరున్నది ఎందుకు అంటే రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించడానికే అన్నట్లు విరుచుకు పడ్డారు. ఆయన ప్రచారం పని చేసిందో, రాష్ట్ర ప్రజల దురదృష్టమో కానీ, ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో కానీ, జగన్‌ రెడ్డి ఆయనకు మరీ మొండి చేయి చూపించకుండా, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి యిచ్చి చేతులు దులిపేసుకున్నారు. అయితే.. కోతికి కొబ్బరికాయ దొరికించే చాలన్నట్లుగా పృద్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత గా తిడితే, అంతగా జగన్‌ దృష్టిలో పడొచ్చని భావించారు. మరో మెట్టు ఎక్కచ్చని అనుకున్నారో ఏమో కానీ, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ యియర్స్‌ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి.అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు.ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌ లో విరుచుకుపడ్డారు. అయితే, పృధ్వీ ఎస్వీబీసే వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది. ఒక మహిళకు ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్‌ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే, అక్కడి నుంచి థర్టీ ఇయర్స్‌ ఫృధ్వీ కి కష్టాలు మొదలయ్యాయి. ఎస్వీబీసీ నుంచి గెంటేసిన తర్వాత, వైసీపీలో ఆయన్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది. కానీ దాదాపుగా ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబు మంత్రిగా పదోన్నతి పొంది కొనసాగుతున్నారు. కాగా కొంచెం ఆలస్యంగానే అయినా, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది. అప్పట్లోనే తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రపన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు, పక్క చూపులు చూశారు.పవన్‌ కళ్యాణ్‌ పంచన చేరేందుకు ప్రయత్నించారు. 2024 ఎన్నికలలో జనసేన 40 స్థానాలలో విజయం సాధిస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ అదేవిూ ఆయనకు జనసేనలోకి ఎంట్రీ పాస్‌ గా ఉపయోగపడిన దాఖలాలు కనిపించడం లేదు. గతంలో ఇదే థర్టీ యిండస్ట్రీస్‌ పృద్వీ అందరి కంటే ఎక్కువగా పవన్‌ కళ్యాణ్‌ పైనే వ్యక్తిగత విమర్శలు గుప్పించారని గుర్తు చేస్తూ జనసైనికులు ఆయనపై విమర్శలు గుప్పించారు. రాజకీయాలలో విమర్శలూ, ఆ తరువాత పొగడ్తలూ చేయడం నాయకులకు సాధారణమేననీ, గతంలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా చేసిందీ అదే కదా అంటున్న వారు లేకపోలేదు. అయితే, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఫృధ్వీ మాత్రం కొంచం చాలా అతి చేశారనీ, అందుకే ఆయనను దగ్గరకు రానీయడానికి జనసేనే కాదు, యిండస్ట్రీ కూడా యిష్టపడటం లేదనీ అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పృధ్వీ పరిస్థితి ఎవరికీ పట్టని వాడు ఎక్కెక్కి ఏడుస్తున్నట్లుగానే ఉందని పరిశీలకులు అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *