ఎంఐఎం, బిఆర్‌ఎస్‌ మధ్య సంబంధాలు బీటలు

తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీకి మిత్ర పక్షాల కంటే శత్రు పక్షాలే ఎక్కువవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత బిఆర్‌ఎస్‌ నుంచి వామ పక్షాలు దూరమయ్యాయి. ఏరు దాటకముందు వీర మల్లన్న , ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుంది బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసీఆర్‌ వ్యవహారం. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డిని ఓడిరచడంలో కీలక పాత్ర పోషించిన వామ పక్షాలను బిఆర్‌ఎస్‌ గెలిచిన తర్వాత ప్రగతిభవన్‌ మెట్లు కూడా ఎక్కనియ్యలేదు కెసీఆర్‌. తొమ్మిదేళ్లు చెట్టపట్టాల్‌ వేసుకున్న ఎంఐఎంతో ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ మధ్య సంబంధాలు బీటలు వారాయి. ఆదిలాబాద్‌, సంఘారెడ్డి బహిరంగ సభల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ బిఆర్‌ఎస్‌ అధినేత కెసీఆర్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రిని డెవలప్‌ చేసిన కెసీఆర్‌ హైద్రాబాద్‌ లో ఇస్లామిక్‌ సెంటర్‌ పెట్టలేకపోతున్నారన్నారు అని ఆరోపించారు. ముస్లింల శ్రేయస్సు కోసం బిఆర్‌ఎస్‌ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎంఐఎం అధినేత తొలిసారి కెసీఆర్‌ ను బాహాటంగా విమర్శించడం సంచలనం అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నప్పటికీ స్వంత రాష్ట్రంలో హైదరాబాద్‌ పాతబస్తీకే పరిమితమైంది. పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ తెలంగాణలో ఇతర స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచేది కాదు. ముస్లింలు అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలలో సైతం ఎంఐఎం పోటీ చేసేది కాదు. పైగా బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడానికి ఒవైసీ పాటుపడేవారు. ముస్లింల వోట్లు కాంగ్రెస్‌ కు పడకుండా కేసీఆర్‌ జాగ్రత్తలు పడేవారు. అందులో భాగంగా కెసీఆర్‌ మజ్లిస్‌ సపోర్ట్‌ తీసుకున్నారు. ముస్లింల వోట్లు బిఆర్‌ఎస్‌ కు పడే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు కెసీఆర్‌. ఇన్ని రోజులు మజ్లిస్‌ పార్టీ, బిఆర్‌ఎస్‌ మిత్ర పక్షాలుగా ఉండి ప్రస్తుతం శత్రు పక్షాలుగా మారడానికి మజ్లిస్‌ పార్టీ రహస్య ఎజెండా ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అక్బరుద్దీన్‌ ఓవైసీ మాత్రమే బిఆర్‌ఎస్‌ విూద విరుచుకుపడేవారు. ప్రస్తుతం అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడుతున్నారు. మజ్లిస్‌ బీఆర్‌ ఎస్‌ సంబంధాలు దెబ్బతినకుండా అసదుద్దీన్‌ ప్యాచప్‌ చేసేవారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పోటీ చేసి 50 స్థానాలు కైవసం చేసుకుంటుందని అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మజ్లిస్‌ ను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కెసీఆర్‌ మజ్లిస్‌ కు ఎంఎల్‌ సీ సీటు కేటాయించారు. కొత్త సచివాలయంలో మసీదు కట్టలేదని, షాదీ ముబారక్‌ అసలైన లబ్ది దారులకు అందడం లేదు వంటి ఆరోపణలు చేశారు అసదుద్దీన్‌. ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో మజ్లిస్‌ పోటీ చేస్తే ఆ పార్టీ మాత్రమే స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఇదే సవిూకరణాలు కొనసాగితే బిఆర్‌ఎస్‌ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో స్థానాలు కోల్పోవడం ఖాయం. ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ కు ఏ ఒక్క పార్టీ కూడా మిత్ర పక్షం లేకపోవడం ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *