కోదాడలో ట్రయాంగిల్‌ ఫైట్‌ తప్పదా

తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉండే కోదాడలో.. రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంకొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో.. నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరిగిపోయింది. మరోసారి పోటీలో నిలిచేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రూటు క్లియర్‌ చేసుకుంటుండగా.. ఆశావహులు కూడా తమ ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు. ఇక.. గులాబీ పార్టీకి ఎలాగైనా చెక్‌ పెట్టాలని.. మిగతా పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. మరి.. విపక్షాల నుంచి టికెట్‌ రేసులో ఉన్న నేతలెవరు? కోదాడ సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒకెత్తయితే.. కోదాడ మాత్రం కాస్త డిఫరెంట్‌. తెలంగాణ సరిహద్దు సెగ్మెంట్‌ అయిన కోదాడలో.. ఏపీ రాజకీయాలు కూడా బాగా ప్రభావితం చేస్తాయ్‌. ఉమ్మడి జిల్లా మొత్తంలో.. సెటిలర్ల ఓట్‌ బ్యాంక్‌ ప్రభావం ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని చాలా గ్రామాలు, పట్టణాల నుంచి.. వివిధ అవసరాల కోసం కోదాడకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇప్పటికీ.. అక్కడ ఏపీ, తెలంగాణ కలిసిన వాతావరణం కనిపిస్తుంటుంది. మొదట్నుంచి.. తెలంగాణవాదం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కోదాడ ఒకటిగా చెబుతుంటారు. కానీ.. గత ఎన్నికల్లో తొలిసారి అది బ్రేక్‌ అయింది. అనూహ్యంగా.. గులాబీ జెండా ఎగిరిందనే అభిప్రాయం బలంగా ఉంది.1962లో ఏర్పడిన కోదాడ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌, తెలుగుదేశం అభ్యర్థులు చెరో ఐదు సార్లు గెలిచాయ్‌. మొట్టమొదటిసారిగా గత ఎన్నికల్లో.. అధికార బీఆర్‌ఎస్‌ తరఫున.. బొల్లం మల్లయ్య యాదవ్‌ గెలిచారు. కోదాడ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు మండలాలున్నాయి. అవి.. మునగాల, నడిగూడెం, కోదాడ, మోతె, చిలుకూరు, అనంతగిరి. వీటి పరిధిలో.. 2 లక్షల 25 వేల మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో బీసీల ఓట్‌ బ్యాంక్‌ అధికంగా ఉంటుంది. వీరిలో.. యాదవ సామాజికవర్గం ఓట్‌ బ్యాంక్‌ బలంగా ఉంది. అదే.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ . రాజకీయంగా బలపడేందుకు కారణమని చెబుతున్నారు.అదే విధంగా.. కోదాడ నియోజకవర్గంలో.. వెలమ, కమ్మ సామాజికవర్గం ఓటర్లు కూడా 30 వేలకు పైనే ఉంటారు. వీళ్లంతా.. గతంలో తెలుగుదేశం ఓట్‌ బ్యాంక్‌గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కోదాడ పట్టణం, మండల పరిధిలో.. సెటిలర్ల ఓటర్ల ప్రభావం అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ ప్రభావం కూడా తనకు అనుకూలంగా ఉంటుందని మల్లయ్య యాదవ్‌ అంచనా వేస్తున్నారు. అదేవిధంగా.. మునగాల, నడిగూడెం, మోతె మండలాల్లో సీపీఎం, చిలుకూరు మండలంలో సీపీఐ ప్రభావం కనిపిస్తుంది.నిజానికి కోదాడ నియోజకవర్గం.. మొదట కాంగ్రెస్‌కు.. తర్వాత తెలుగుదేశానికి కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ రావు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన తర్వాత.. బొల్లం మల్లయ్య యాదవ్‌ కూడా సైకిల్‌ దిగి కారెక్కడంతో.. తెలుగుదేశం ఓట్‌ బ్యాంక్‌ అంతా బీఆర్‌ఎస్‌ వైపు మళ్లింది. దాంతో.. మల్లయ్య యాదవ్‌ తొలిసారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. గెలుపు జెండా ఎగరేశారు. గత ఎన్నికల సమయంలో.. టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్యకు.. బీఆర్‌ఎస్‌ నుంచి ఊహించని ఆఫర్‌ వచ్చింది. చివరి నిమిషంలో కారు పార్టీ టికెట్‌ దక్కించుకొని.. అప్పటి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సతీమణి.. ఉత్తమ్‌ పద్మావతిపై గెలుపొందారు.కోదాడలో తొలిసారి గులాబీ జెండా ఎగరేసి సత్తా చాటారు. వాస్తవానికి.. అప్పటిదాకా బీఆర్‌ఎస్‌ కోదాడ ఇంచార్జ్‌గా ఉన్న శశిధర్‌ రెడ్డి అధికార పార్టీ నుంచి టికెట్‌ ఆశించారు. కానీ.. పరిస్థితులకు తగ్గట్లుగా గెలుపు గుర్రాన్ని సెలక్ట్‌ చేసి.. కేసీఆర్‌ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. మల్లయ్య యాదవ్‌కు టికెట్‌ ఇచ్చి.. కాంగ్రెస్‌ని దెబ్బకొట్టారు. అయితే.. ఇప్పుడు కోదాడ బీఆర్‌ఎస్‌లోనూ వర్గ పోరు కనిపిస్తోంది. పార్టీలో సీనియర్ల వర్గం, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ వర్గం మధ్య.. ఆధిపత్య పోరు కనిపిస్తోంది. అయినా.. అవేవీ తనకు పెద్ద సమస్య కాదనే విశ్వాసంతో ఉన్నారు ఎమ్మెల్యే. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలు తన వైపే ఉన్నారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు మల్లయ్య యాదవ్‌.సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ ధీమా ఇలా ఉంటే.. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ రావు, పార్టీ నేత శశిధర్‌ రెడ్డి, కోదాడ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త లక్ష్మీనారాయణ.. ఓ వర్గంగా ఏర్పడి.. ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. ఎలాగైనా రానున్న ఎన్నికల్లో వాళ్ల ముగ్గురిలో.. ఎవరో ఒకరు టికెట్‌ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇక.. సూర్యాపట జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న గుజ్జ దీపిక భర్త యుగంధర్‌ రావు కూడా ఇప్పుడు కోదాడ బీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులోకి వచ్చారు. జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో ఉన్న సంబంధాలతో.. రాబోయే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన యుగంధర్‌ రావు సీన్‌లోకి వస్తే.. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ రావు కూడా ఆయనకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి.ఈ పరిస్థితుల నేపథ్యంతో.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్‌ని గనక అధిష్టానం మార్చాల్సి వస్తే.. గుజ్జ యుగంధర్‌ రావుకే తొలి ప్రాధాన్యం ఉంటుందని.. గులాబీ పార్టీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంగ, అర్థ బలం మెండుగా ఉండటంతో పాటు.. సూర్యాపేట జడ్పీ ఛైర్మన్‌గా యుగంధర్‌ రావు భార్య దీపిక ఉండటం, ప్రజల్లో క్లీన్‌ ఇమేజ్‌ పొందడంతో.. టికెట్‌ రేసులో ఆయన ముందుకొచ్చారు. గ్రూపు తగాదాలతో మల్లయ్య యాదవ్‌కు టికెట్‌ దక్కకపోతే.. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా.. యుగంధర్‌ రావుకే చాన్స్‌ రావొచ్చనే ప్రచారం జోరుగు సాగుతోంది.కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్‌.. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం.. నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. తొలిసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది ఇక్కడి నుంచే. అయితే.. 2009లో కొత్తగా ఏర్పడిన హుజూర్‌నగర్‌కు ఆయన వెళ్లడంతో.. తర్వాత కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేదనే చర్చ జరిగింది. దాంతో.. 2014 ఎన్నికల్లో స్వయంగా తన సతీమణి పద్మావతిని.. కోదాడ బరిలో నిలిపారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించి.. ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే.. గత ఎన్నికల్లో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో పద్మావతి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత.. చాలా మంది కాంగ్రెస్‌ ముఖ్య నేతలు.. బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో.. గతంలో కంటే కోదాడలో కాంగ్రెస్‌ మరింత బలహీనపడిరదే అభిప్రాయాలున్నాయి.పార్టీ గత వైభవాన్ని పొందాలంటే.. ఈసారి కోదాడ నుంచి కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేయాలని.. క్యాడర్‌ బలంగా కోరుకుంటోంది. ఇప్పటికే.. హుజూర్‌ నగర్‌, కోదాడలో సర్వే చేయించిన ఉత్తమ్‌.. కోదాడ నుంచే పోటీకి మొగ్గు చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నా.. కోదాడలో తానే పోటీ చేస్తానని ఉత్తమ్‌ పద్మావతి చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతే తనను గెలిపిస్తుందని.. ప్రజలంతా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పద్మావతి అంటున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోదాడను చేజార్చుకున్న కాంగ్రెస్‌.. ఈసారి కచ్చితంగా విజయం సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.మరోవైపు.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా కోదాడలో కాంగ్రెస్‌ విజయంపై ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కోదాడలో హస్తం పార్టీకి 50 వేలకు పైనే మెజారిటీ వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు ఉత్తమ్‌. ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది.అయితే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్‌ రెండు వర్గాలు వీడిరదనే అభిప్రాయం పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వర్గం ఒక వైపు.. పార్టీ సీనియర్‌ నేతల గ్రూప్‌ మరోవైపు అన్నట్లుగా.. కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. కోదాడలో ప్రముఖ విద్యావేత్త పందిరి నాగిరెడ్డి ఉత్తమ్‌ దంపతులతో సంబంధం లేకుండా.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో.. ఆయన కూడా టికెట్‌ ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక.. కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. బీజేపీ, తెలుగుదేశం, బీఎస్పీల పరిస్థితి నామమాత్రమే అని చెప్పొచ్చు. వామపక్ష పార్టీలు.. రెండు, మూడు మండలాలకే పరిమితమైపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే సత్తా ఉన్నా.. అసెంబ్లీకి ఒంటరిగా పోటీ చేస్తే.. డిపాజిట్‌ కూడా దక్కే పరిస్థితి లేదు.ఓవరాల్‌గా కోదాడ నియోజకవర్గంలో.. ఈసారి కూడా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సానుభూతి కలిసొచ్చినప్పటికీ.. రాజకీయంగా దానిని నిలబెట్టుకోవడంలో.. మల్లయ్య యాదవ్‌ సక్సెస్‌ కాలేకపోయారనే విమర్శలున్నాయి. పార్టీలో నెలకొన్న వర్గపోరు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను బాగా ఇబ్బంది పెడుతోంది. స్థానికంగా గట్టి పట్టు ఉన్నప్పటికీ.. ఉత్తమ్‌ దంపతుల విక్టరీ కొడతారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. రానున్న ఎన్నికల్లో కోదాడ పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్‌లోని వర్గ పోరే తమకు కలిసొస్తుందనే భావనలో కాంగ్రెస్‌ ఉంది. ఈ పరిస్థితుల్లో.. కోదాడ నియోజకర్గంలో ఎలాంటి సీన్‌ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *