మూడు తర్వాత మార్పులు తప్పవా

హైదరాబాద్‌, నవంబర్‌ 30
ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపుతాయా? ఇక్కడ పార్టీల గెలుపోటములు అక్కడి లెక్కలను సరిచేస్తాయా? అసలు ఏ పార్టీ గెలిస్తే.. అక్కడ ఏ పార్టీకి అడ్వాంటేజ్‌? తెలుగు రాష్ట్రాల్లో ఇదే బలమైన చర్చ నడుస్తోంది. మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే జోరుగా అన్ని పార్టీలు ప్రచారం చేశాయి. ప్రజల మద్దతు కోరాయి. ప్రజానాడీ అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. డిసెంబర్‌ 3న విజేత ఎవరన్నది తేలనుంది. అయితే ఈ ఫలితం పై తెలంగాణతో పాటు ఏపీ ప్రజల సైతం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసాయి. అధికార బీఆర్‌ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌, బిజెపిలు గెలుపు పై నమ్మకం పెట్టుకున్నాయి. కానీ ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారన్నది చూడాలి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు తప్పకుండా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని బలంగా ప్రచారం జరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్‌ అవుతుందన్న టాక్‌ ఉంది. సంక్షేమానికి తెలంగాణ ప్రజలు జై కొట్టారు కాబట్టి.. ఏపీలో సైతం అదే మాదిరిగా జగన్‌ కు ప్రజలు మద్దతు తెలుపుతారు అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మాత్రం టీడీపీకి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టిడిపి పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మెజారిటీ టిడిపి క్యాడర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పనిచేస్తుంది. అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే సొంత పార్టీ నేత పవర్‌ లోకి వచ్చినంత భావన టిడిపిలో వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్‌ గెలిస్తే ఏకకాలంలో అటు కేసీఆర్‌ ను, జగన్కు సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్న కేంద్ర ప్రజలను దెబ్బకొట్టినట్లు అవుతుందని టిడిపి భావిస్తోంది.ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఈ కూటమి వచ్చే ఫలితాలు బట్టి ఏపీలో నిర్ణయాలు మారే అవకాశం ఉంది. టిడిపి, బిజెపి,జనసేన కలిస్తే ఒక లెక్క.. వేర్వేరుగా పోటీ చేస్తే మరో లెక్క ఉండనుంది. అయితే తెలంగాణ ఫలితాలను ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే అది తమ విజయం గా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బిఆర్‌ఎస్‌ అధికారం నిలబెట్టుకోగలిగితే.. వైసీపీ సైతం అదే తరహా ప్రయత్నం చేయనుంది. ఒకవేళ బిజెపి, జనసేన కూటమికి అనుకూల ఫలితాలు వస్తే? ఏపీలో టిడిపి పై ఆ రెండు పార్టీల ఒత్తిడి అధికం కానుంది. ఇలా తెలంగాణ ఫలితాలు ఏపీ పై ప్రభావం చూపుతాయని రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. మరి తెలంగాణ ఓటరు మదిలో ఏముంది అన్నది చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *