రిటైర్మెంట్‌ తర్వాత కీలక పదవి…?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో అంత ఈజీగా అర్థం కాదు అంటుంటారు. తాను కోరుకుంటే ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా కేసీఆర్‌ మాత్రం చేసేదే చేస్తుంటారనేది రాజకీయవర్గాల్లో టాక్‌. తాజాగా కేసీఆర్‌ చేసిన ఓ కామెంట్‌ అధికార, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. డీజీపీ మహేందర్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. రిటైర్మెంట్‌ అనంతరం కూడా ఆయన సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోబోతోందని సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. పదవీ విరమణ చేసిన అనేక మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ లకు కేసీఆర్‌ తిరిగి ఏదో ఓ పదవి కట్టబెడుతున్నారని అందువల్ల సర్వీస్‌ లో ఉన్న అనేక మంది ఉత్సాహవంతులైన ఆఫీసర్స్‌ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కానీ కేసీఆర్‌ మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. మాజీ ఐపీఎస్‌ ఏకే ఖాన్‌, మాజీ ఐఏఎస్‌ వెంకట్రామి రెడ్డిలకు రిటైర్మెంట్‌ తర్వాత కేసీఆర్‌ కీలక పదవులు అప్పగించారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి విషయంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సృష్టికర్త డీజీపీ మహేందర్‌ రెడ్డియే అని ఆ క్రెడిట్‌ అంతా ఆయన ఖాతాలోనే వేశారు కేసీఆర్‌. ఈ అంశంలో సభీకుల అందరి చేత చప్పట్లు కొట్టించారు. డీజీపీని స్వయంగా కేసీఆర్‌ పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేందర్‌ రెడ్డి వచ్చే డిసెంబర్‌ లో పదవీవిరమణ పొందుతారు. రిటైర్మెంట్‌ అయినా సరే మహేందర్‌ రెడ్డి సేవలను మరోలా ఉపయోగించుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. ఆయన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన సేవలను ఉపయోగించుకునే విషయాన్ని తాను మహేందర్‌ రెడ్డితో చెప్పానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మారబోయేది డ్రస్సే కానీ సేవలు కాదు అంటూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు.కేసీఆర్‌ వ్యాఖ్యలతో మహేందర్‌ రెడ్డి విషయంలో అనేక ఊగానాగాలు వ్యక్తం అవుతున్నాయి. పదవీవిరమణ పొందిన పలువురు ఆఫీసర్లకు కేసీఆర్‌ నామినేటెడ్‌ పదవులు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని రాజీనామా చేయించి ఎమ్మెల్సీ బరిలో నిలిపిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి సేవలను ఎలా ఉపయోగించుకోబోతున్నారనేది ఆసక్తిని రేపుతోంది. ఏదైనా నామినేటెడ్‌ పదవి అప్పగిస్తారా? లేక ప్రత్యక్ష ఎన్నికల్లోకి ఆహ్వానించి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయిస్తారా? అనేది చర్చగా మారింది. రాష్ట్రంలో రిటైర్మెంట్‌ అయిన వారికే తిరిగి పదవులు కట్టబెడుతున్నారని, వారంతా ప్రభుత్వానికి వంతపాడుతున్నారనే విమర్శలు రాజకీయ పక్షాల నుండి వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్‌ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *