పాపం… పొన్నాల….

వరంగల్‌, ఆగస్టు 28
త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతుంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే జనగాం టికెట్‌ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియర్‌ నేతను కాదని కొత్తగా వచ్చిన నేతకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.కొద్దిరోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించగా?కాంగ్రెస్‌ పార్టీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి అయింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించే పనిలో ఉంది. త్వరలోనే తొలి జాబితాను విడుదల చేసే దిశగా హస్తం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. భారీగా దరఖాస్తులు రావటంతో?నేతలకు టికెట్‌ అంశం దడ పుటిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితిని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ సీనియర్‌ నేత సీరియస్‌ గా ఎదుర్కొంటున్న సిచ్యూయేషన్‌ కనిపిస్తోంది. పైగా ముఖ్య నేతలు కూడా పెద్దగా పట్టించుకోకపోవటంతో? హస్తిన బాట కూడా పట్టారు సదరు నేత. ఈ నేపథ్యంలో? వచ్చే జాబితాలో ఆయన పేరు ఉంటుందా..? ఉండదా..? అనేది జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.పొన్నాల లక్షమ్మయ్య…. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీపీసీసీ తొలి అధ్యక్షుడిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించినప్పటికీ… రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన పరిస్థితి మారిపోయింది. 2014తో పాటు 2018 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి ఓటమిపాలు కాగా…రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టిగా భావిస్తున్నారు. రాజకీయంగా కూడా ఆయనకు ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్‌ అని చెప్పొచ్చు. నాటి నుంచి జనగామ నియోజకవర్గంలో అన్నీతానై నడిపించిన పొన్నాలకు… కొద్దిరోజులుగా వ్యతిరేక పవనాలు వీస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఓ దశలో ఆయనకు టికెట్‌ కు వస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఫలితంగా పొన్నాల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.పొన్నాల టెన్షన్‌ కు కారణాలు లేకపోలేదు. ఇదే నియోజకవర్గానికి చెందిన కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిని జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించింది ఏఐసీసీ. ఈ విషయంపై పొన్నాలతో కనీసం సంప్రదింపులు జరగకుండానే నిర్ణయం జరిగిపోయిందట! ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రతాప్‌ రెడ్డి నియోజకవర్గంలో గట్టిగా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్న ప్రతాప్‌ రెడ్డి… పొన్నాలపై కేవలం 236 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరగా… 2018 సంవత్సరంలో హస్తం గూటికి చేరారు. ఇయన చేరికతో జనగామ కాంగ్రెస్‌ రెండువర్గాలు చీలిపోయింది. నాటి నుంచి ఎవరికి వారిగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు.జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దక్కించుకోవటం వెనక రాష్ట్ర నాయకత్వంలోని ఇద్దరు కీలక నేతలు చక్రం తిప్పారని పొన్నాల భావిస్తున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి తనకు టికెట్‌ రాకుండా పావులు కదుపుతున్నారని అలర్ట్‌ అయిపోయారు. వెంటనే జానారెడ్డి వంటి సీనియర్‌ నేతలతో చర్చలు జరిపారు. అంతేకాదు తాజాగా హస్తినకు వెళ్లిన ఆయన… కేంద్ర పెద్దలను కలిసి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కూడా పొన్నాలకు టికెట్‌ ఇచ్చే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగినప్పటికీ… హైకమాండ్‌ ఆశీసులతో టికెట్‌ దక్కించుకున్నారు. ప్రస్తుతం మరోసారి అలాంటి సీన్‌ కనిపిస్తుండగా… ఈసారి పొన్నాలకు టికెట్‌ దక్కుతుందా..? లేక ప్రతాప్‌ రెడ్డివైపు నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 2014 ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల టికెట్ల కేటాయింపులో కీలకంగా వ్యవహరించగా? ఇప్పుడేమో తన టికెట్‌ కోసమే తీవ్రంగా ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొనటం చర్చనీయాంశంగా మారింది.2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన పొన్నాలకు 51,379 ఓట్లు దక్కించున్నారు. ఇదే ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉన్న కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి కేవలం 21,113 వేల ఓట్ల సరిపెట్టుకోగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 84074 ఓట్లు దక్కించుకున్నారు. 32,695 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో మరోసారి ఇదే సీటు నుంచి పోటీ చేసిన పొన్నాల… 62,024 ఓట్లు దక్కించుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముత్తిరెడ్డి.. 91,592 ఓట్లు సాధించి 29,568 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *