వచ్చేసిన కొత్త పుస్తకాలు…

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాకు పుస్తకాలొచ్చాయి. 2023?24 విద్యాసంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభ సమయానికి విద్యార్థులందరికీ పుస్తకాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న గోడౌన్‌కి ఇప్పటికే 9 లక్షల పుస్తకాలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు దశలవారీగా గోడౌన్‌కు వస్తాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా అంటే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 31 లక్షల పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ పుస్తకాలన్నీ సరఫరా చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని గోడౌన్‌ నుంచి ఆయా మండల కేంద్రాల్లోని స్టాక్‌ పాయింట్లకు సకాలంలో పుస్తకాలు అందించేలా ప్రణాళిక రూపొందించారు.పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీ నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పుస్తకాలు ఉండేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందని పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం సీఎం జగన్‌ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసి దాదాపు రెండు నెలలు ముందుగానే పుస్తకాలన్నీ అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. పాఠశాలలు తెరచిన రోజునే పుస్తకాలను విద్యార్థులకు అందించేలా విద్యాశాఖాధికారులు దృష్టిసారించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాఠ్యపుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను కూడా ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే దీక్ష యాప్‌ ద్వారా సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లలో కూడా పాఠ్యాంశాలు కనిపిస్తాయి. మిర్రర్‌ ఇమేజ్‌ పుస్తకాల ముద్రణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తెలుగు, ఇంగ్లిషు విూడియంలో పాఠ్యాంశాలు ఉన్నాయి. వీటి వల్ల తెలుగు విూడియం నుంచి ఇంగ్లిష్‌ విూడియంలో చేరిన విద్యార్థులకు ఎంతో సులభంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 9వ తరగతికి కొత్తగా రూపొందించిన సిలబస్‌ మేరకు పుస్తకాలను ముద్రిస్తున్నారు. గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు మూడు సెమిస్టర్ల విధానం ఉండగా ఈ సారి రెండు సెమిస్టర్లకు అనుగుణంగా పుస్తకాలు రూపొందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *