పక్క చూపులు చూస్తున్న సోయం బాపురావు

అటు సొంత పార్టీ.. ఇటు తన సామాజిక వర్గం.. ఇంతలో రాథోడ్‌ రమేష్‌ చేరిక.. మధ్యలో ఎంపీ సోయం బాపురావు.. మింగలేక.. కక్కలేక.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇంతకాలం సొంత సామాజిక వర్గం (ఆదివాసీ) ఓట్లను నమ్ముకుని రాజకీయాలు చేసిన ఎంపీ సోయం బాపురావుకు తాజాగా సంకట పరిస్థితి నెలకొంది. గతంలో కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ.. తాజాగా బీజేపీ.. ఇలా తాను ఏ పార్టీలో ఉన్నా.. ఆదివాసీ ఓట్లే ఆయనకు బలం, బలగం. ‘లంబాడా హటావో.. ఆదివాసీ బచావో’ నినాదంతో తుడుం దెబ్బను నడిపించారు. తాజాగా బీజేపీలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన రాథోడ్‌ రమేష్‌తో కలిసి నడవటం కొత్త చిక్కులు తెస్తోంది. లంబాడాలకు రిజర్వేషన్లు తొలగించటమే లక్ష్యంగా పని చేస్తున్న తుడుం దెబ్బ.. ప్రస్తుతం ఆ లంబాడా నాయకుడితో జతకట్టడంతో ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.సోయం బాపురావు బోథ్‌ నియోజకవర్గంలోని ఆదివాసీ తెగకు చెందిన వారు. ఈయన గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. తర్వాత చీలిక వర్గంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. 2014లో టికెట్‌ రాలేదు. వైసీపీ, టీడీపీలో కూడా పనిచేశారు. 2018లో కాంగ్రెస్‌ నుంచి బోథ్‌ అసెంబ్లీకి పోటీ చేయగా.. ఓడిపోయారు. దీంతో 2019లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆయన గత రెండు దశాబ్దాల రాజకీయ జీవితం పూర్తిగా ఆదివాసీ ఉద్యమంతో ముడిపడి ఉంది. లంబాడాలకు రిజర్వేషన్లు వర్తించవద్దని, ఆదివాసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని పోరాటం చేస్తున్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. ఆదివాసీ ఓట్లే ఆయనకు బలం, బలగం. ఏ పార్టీలో ఉన్నా ఈ ఓట్లే ఆయన గెలుపును ప్రభావితం చేశాయి. గతంలో ఎమ్మెల్యే, తాజాగా ఎంపీగా గెలిచేందుకు ఆదివాసీ ఓట్లే కీలక భూమిక పోషించాయి.అలాంటిది తాజాగా ఆయనకు తన సొంత సామాజిక వర్గమైన ఆదివాసీల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆదివాసీ ఉద్యమం పేరుతో తుడుందెబ్బను వాడుకుని.. తమ ఓట్లతో గెలుపొంది విస్మరిస్తున్నారనే వాదన, విమర్శలు ఆదివాసీ నాయకుల నుంచి వస్తున్నాయి. మంగళవారం ఆదిలాబాదులో 9 తెగల గిరిజన నాయకులు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి.. భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించటం, సోయం తీరును ఎండగట్టడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగిస్తామని చెప్పి ఆదివాసులను ఎంపీ మోసం చేస్తున్నారని, లంబాడా హటావో.. ఆదివాసీ బచావో నినాదంతో తుడుందెబ్బ చేసే పోరాటాన్ని సోయం ఏదో ఒక పార్టీలో పదవులు, ఓట్ల కోసం వాడుకుని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించటం సాధ్యం కాదని తెలిసినా.. అమాయక ఆదివాసీలను మోసం చేసి వాడుకుంటున్నారని విమర్శించారు. లంబాడా హటావో ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి.. లంబాడా నాయకుడితో దోస్తీ చేస్తున్న సోయం ఎంపీ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ తన సొంత సామాజిక వర్గం నుంచి రావటం ఇటు జిల్లా, అటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.రెండు దశాబ్దాల పాటు అండగా నిలిచిన ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలు వ్యతిరేకించటానికి ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలే కారణమని తెలుస్తోంది. లంబాడా తెగకు చెందిన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌.. తమ జాతి వారికి మొదటి నుంచి అండగా ఉన్నారు. ఆయన ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ వీడి బీజేపీలో చేరారు. ఆయన చేరికను మొదటి నుంచి సోయం బాపురావు వ్యతిరేకించినా.. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం సర్ది చెప్పటం, రాథోడ్‌ వచ్చి సోయంను స్వయంగా కలవటంతో మెతకబడ్డారు. ఆయన చేరికతో అసలు లొల్లి మొదలైంది. ఆదివాసీలకు వ్యతిరేకమైన లంబాడా తెగకు చెందిన నాయకుడు రాథోడ్‌ రమేష్‌తో జతకట్టి.. లంబాడా టైగర్‌ రాథోడ్‌ రమేష్‌, ఆదివాసీ టైగర్‌ సోయం బాపురావు అనే మాటలతో ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాథోడ్‌ రమేష్‌తో కలిసి ఒకే పార్టీలో ఉండటాన్ని ఆదివాసీల నేతలు, ఆదివాసీలు జీర్ణించుకోలేపోతున్నారు. ఆయన బీజేపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ తెరపైకి తెస్తున్నారు. మరోవైపు సోయం బాపురావు సంకట పరిస్థితిలో పడిపోయారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకతను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కానీ స్థితిలో పడిపోయారు. అటు సొంత పార్టీని కాదనలేని వైనం. ఒకే పార్టీలో ఇద్దరు వ్యతిరేక భావజాలం ఉన్న నాయకులు సర్దుకుని పోవాలని భావించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో కొత్త చిక్కులు మొదలయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *