ప్రారంభోత్సవానికి సిద్ధమైన మహబూబ్‌నగర్‌ ఐటీ టవర్‌

హైదరాబాద్‌ ఐటీ రంగం హబ్‌గా ఉంటూనే, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఐటీ టవర్ల నిర్మాణం వంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలోని టైర్‌`2 నగరాలు ప్రధాన వృద్ధి చోదకులుగా ఎదుగుతున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని. అందులో భాగంగానే ఐటీ కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పేందుకు సకల సౌకర్యాలతో నాలుగు ఎకరాల సువిశాల స్థలంలో రూ.40 కోట్లతో నిర్మించిన ఐదంతస్తుల ఐటీ టవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మహబూబ్‌నగర్‌ శివార్లలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ప్రారంభించనున్నారు.రాష్ట్రంలోని టైర్‌`2 నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. 2018 జూలైలో మంత్రి కెటి రామారావు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇవే కాకుండా 377 ఎకరాల్లో ఐటీ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే, హైదరాబాద్‌`బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ టవర్‌ నుండి 100 అడుగుల రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీఈవో విజయ రంగినేని మాట్లాడుతూ.. ఐటీ టవర్‌ నుంచి ఇప్పటి వరకు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎనిమిది కంపెనీలు ముందుకు వచ్చాయని, స్థలం కేటాయించామని తెలిపారు. కాగా, ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ పరిశీలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *