మహారాష్ట్రలో కమలం సర్జికల్‌ స్ట్రైక్స్‌

సర్జికల్‌ స్ట్రైక్‌ గురించి తెలుసుగా. ఉన్నట్టుండి మెరుపు దాడులు చేయడం. బార్డర్‌లోనే కాదు. రాజకీయాల్లోనూ సర్జికల్‌ స్ట్రైక్‌లుంటాయి. మహారాష్ట్ర ఇందుకు ఉదాహరణ. రెండేళ్లలో రెండు దాడులను ఎదుర్కొన్నాయి ఇక్కడి పాలిటిక్స్‌. బీజేపీ మైండ్‌గేమ్‌తో దెబ్బకి సీన్‌ అంతా మారిపోయింది. మహారాష్ట్ర వికాస అఘాడి పేరిట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగా…కేవలం రెండేళ్లలో రెండు పెద్ద దెబ్బలు కొట్టింది బీజేపీ. మొదటి దెబ్బకు ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు రెండో దెబ్బకి ప్రతిపక్ష కూటమి పునాది కదిలిపోయింది. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌పై మేనల్లుడు అజిత్‌ పవార్‌ తిరుగుబాటు చేశారు. నాయకత్వం విషయంలో చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారని పైకి చెబుతున్నా…లోపల జరిగింది మాత్రం వేరే. శివసేనలో ఉన్న అసంతృప్తి నేత ఏక్‌నాథ్‌ శిందేకి గాలం వేసి ఆ పార్టీని చీల్చిన బీజేపీ…ఆ తరవాత ఎన్‌సీపీ ని టార్గెట్‌ చేసింది. ఇలా కూటమిలోని రెండు పార్టీలనూ దెబ్బ కొట్టింది. అజిత్‌ పవార్‌ తిరుగుబాటుతో ఎన్‌సీపీ కి గట్టి దెబ్బే తగిలింది. మహారాష్ట్రలో తమకు ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్న బీజేపీ…దాన్ని కరెక్ట్‌గా అమలు చేసింది. అజిత్‌ పవార్‌తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మేరకు బీజేపీకి గట్టి పట్టు దొరికినట్టే. మెజార్టీ బాగానే పెరుగుతుంది. ఇప్పటికే 125 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీకి కొత్త మంత్రులూ తోడైతే సులువుగా మెజార్టీ సాధించేస్తుంది. ఓవరాల్‌గా రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పొజిషన్‌ వచ్చేస్తుంది. ఈ ఊహించని పరిణామం జరగక ముందే మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని హింట్‌ ఇచ్చారు. అటు ముఖ్యమంత్రి శిందే కూడా ఢల్లీికి వెళ్లి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. నిజానికి అజిత్‌ పవార్‌ గనక తమ వర్గంలోకి ఎంటర్‌ అవ్వాలని చూస్తే…తాము ఎగ్జిట్‌ అయిపోతామని శిందే బీజేపీ హైకమాండ్‌తో చెప్పినట్టు సమాచారం. కానీ..ఇప్పుడు ఆయన స్వరం మారిపోయింది. ‘‘ఇద్దరు డిప్యుటీ సీఎంలతో మహారాష్ట్రలో ట్రిపుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పాటైంది’’ అని కామెంట్స్‌ చేశారు శిందే. చీలిపోయిన ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు శరద్‌ పవార్‌ గట్టిగానే ప్రయత్నించారు. అటు శిందే మాత్రం ఈ కూటమిని చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోటీలో చివరికి శిందే పైచేయి సాధించారు. ప్రస్తుతానికి అజిత్‌ పవార్‌కి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవాలంటే 36 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే…అటు ఎన్‌సీపీ మాత్రం అజిత్‌ పవార్‌పై అనర్హతా వేటు వేసేందుకు న్యాయ పోరాటం చేసే అవకాశాలున్నాయి. మరి ఇంత చేసిన బేజీపీ…ఇది ఊహించకుండా ఉంటుందా..? దానికీ ఏదో మార్గం వెతుక్కునే ఉంటుంది. మొత్తానికి మాస్టర్‌ స్ట్రోక్‌తో మహారాష్ట్ర రాజకీయాల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది బీజేపీ. మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పందించారు. రెండ్రోజుల క్రితమే ప్రధాని మోదీ ఎన్‌సీపీ ని ఓ అవినీతి పార్టీ అని విమర్శించారని, ఇంతలోనే అదే పార్టీకి చెందిన లీడర్స్‌ని చేర్చుకున్నారని విమర్శించారు. కొంత మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కడం సంతోషంగానే ఉందని అన్నారు. శిందే ప్రభుత్వంతో చేరి తమపై ఉన్న కేసులన్నింటినీ మాఫీ చేయించుకున్నారని సెటైర్లు వేశారు. ‘‘రెండ్రోజుల క్రితమే ప్రధాని మోదీ మాది అవినీతి పార్టీ అని విమర్శించారు. ఇప్పుడదే పార్టీ లీడర్స్‌ని ప్రభుత్వంలోకి ఆహ్వానించారు. అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచాడు. నాతో కనీసం మాట్లాడలేదు. ఈ సారి నేను ఎలాంటి గూగ్లీ వేయలేదు. నాకు చాలా మంది నేతల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయి. నాకిదేవిూ కొత్త కాదు. 1980లో నా పార్టీ 58 మంది ఎమ్మెల్యేలతో లీడ్‌లో ఉంది. ఆ తరవాత అందరూ వెళ్లిపోయారు. కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే నాకు మిగిలారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఆ సంఖ్యను పెంచుకున్నాను’’జులై 6వ తేదీన తదుపరి కార్యాచరణపై పార్టీ విూటింగ్‌ ఏర్పాటు చేశారు శరద్‌ పవార్‌. ఆ రోజు అందరి నేతలతోనూ చర్చించనున్నారు. పార్టీలో చేయాల్సిన మార్పులపైనా ప్రస్తావించనున్నట్టు వెల్లడిరచారు. మహారాష్ట్ర డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీపీ లోని అందరు ఎమ్మెల్యేలూ శిందే వైపే ఉన్నారని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఎన్‌సీపీ పార్టీ పేరు, గుర్తుతోనే రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే శివసేన విషయంలో ఇది జరగ్గా…ఇప్పుడు అదే సమస్యలో ఎన్‌సీపీ కి ఎదురవుతోంది. చాలా రోజులుగా చర్చించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నాని వెల్లడిరచారు అజిత్‌ పవార్‌. ఏం చేసినా అదంతా అభివృద్ధి కోసమే అని తెలిపారు. ‘‘ఎన్‌సీపీ పార్టీ మొత్తం శిందే ప్రభుత్వంలో చేరినట్టే లెక్క. ఆ పార్టీ పేరు, గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాం. మేం మాత్రమే వాటిని వాడుకుంటాం. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరిగినా వాటన్నింటినీ గమనిస్తూ వచ్చాం. అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాకే ఎన్‌సీపీ నుంచి బయటకు వచ్చేశాం. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఎన్‌సీపీ నుంచి వచ్చేసిన నేతల్లో మరి కొందరికి మంత్రి పదవులు దక్కుతాయి’’ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ విజనరీని పొగిడారు అజిత్‌ పవార్‌. ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రశంసించారు. ప్రస్తుతం తాను తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని, కానీ అవేవిూ పట్టించుకోనని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వెల్లడిరచారు. నాగాలాండ్‌లో 7గురు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్నే ప్రస్తావిస్తూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు అజిత్‌ పవార్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *