మహాబూబాబాద్‌లో ఒకలా.. నల్లగొండలో మరోలా..

మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మకిలీ వదలడం లేదు. ఎంజీ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్నా.. వివాదాల సుడిగుండంలో నుంచి మాత్రం బయటపడడం లేదు. యూనివర్సిటీ ఆది నుంచి వివాదాస్పద వాతావరణమే అక్కడ రాజ్యమేలుతోంది. ఓవైపు అసౌకర్యాల నడుమ విద్యార్థులు.. మరోవైపు యూనివర్సిటీ లో అక్రమ నియామాకాల వ్యవహారంతో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు అనేది దశాబ్దాల నాటి కల. ఆ కలను కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నెరవేరింది. కానీ ఎంజీ యూనివర్సిటీ పాలన మాత్రం నేటికీ గాడినపడకపోవడం గమనార్హం. ఇప్పటికే అధ్యాపకులు, సిబ్బంది నియామకాలకు సంబంధించి జరిగిన అవకతవకలపై హైకోర్టులో వివాదం నడుస్తోంది. కాగా తాజాగా ఎంజీ యూనివర్సిటీ లో మరో వివాదానికి తెర లేచింది.ఇటీవల మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసింది. అయితే ఆ పోస్టు నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా వచ్చిన అప్లికేషన్ల పరిశీలించి హై క్వాలిఫికేషన్‌, ఉత్తమ ప్రతిభ ఉన్న అభ్యర్థులను గుర్తించి గెస్ట్‌ లెక్చరర్‌గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ యూనివర్సిటీ అధికారులు పైరవీకి పెద్దపీట వేశారని తెలుస్తోంది. ఎంజీ యూనివర్సిటీలో తెలుగు బోధించేందుకు ఇప్పటికే పీహెచ్‌డీ పట్టభద్రులు ఉన్నా.. వారందరినీ పక్కకు నెట్టి కేవలం సెట్‌ క్వాలిఫై అయిన పీజీ మహిళా అభ్యర్థికి పట్టం కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఓ కీలక ప్రొఫెసర్‌ సిఫారసుతో పీహెచ్‌డీ పట్టభద్రులను పక్కకు నెట్టి పీజీ చేసిన మహిళా అభ్యర్థితో పోస్టును భర్తీ చేశారు. దీనిపై పీహెచ్‌డీ అభ్యర్థులు యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించగా, కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటుండడం గమనార్హం.గెస్ట్‌ లెక్చరర్ల నియామకంలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలనే నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే మహాబూబాబాద్‌ డిగ్రీ కాలేజీకి సంబంధించి ఓ సబ్జెక్టు బోధించేందుకు సదరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ పోస్టు భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. అయితే సదరు సబ్జెక్టులో అప్పటికే పీహెచ్‌డీ చేసిన వారు అందుబాటులో ఉన్నా.. వారిని కాదని పీజీ చేసి నెట్‌/ సెట్‌ అర్హత ఉన్న జి.రాజేశ్వర్‌ అనే వ్యక్తిని ఎంపిక చేశారు. దీంతో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు కాలేజీ విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన సదరు కమిషనర్‌ గెస్ట్‌ లెక్చరర్‌ నియామాకంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించనందుకు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మీని సస్పెండ్‌ చేశారు. ఇదంతా ఇటీవల జరిగిన తతంగమే. మరీ ఎంజీ యూనివర్సిటీలో రెండు మూడు విభాగాల్లో ఇదే పరిస్థితి ఉన్నా.. చర్యలు మాత్రం శూన్యంగానే మిగిలాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా భావించే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో అవకతవకలు నెలకొనడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. యూనివర్సిటీ లో నిత్యం ఏదో అంశంపై వివాదం నడుస్తూనే ఉంది. అసలే అరకొర వసతుల మధ్య విద్యా సంవత్సరాలను నెట్టుకొస్తున్న విద్యార్థులకు ఇలాంటి సమస్యలు బోనస్‌. ఎన్నో ఆశలతో యూనివర్సిటీ లోకి అడుగుపెడుతున్న విద్యార్థి లోకానికి ఇక్కడి పాలిటిక్స్‌ వల్ల తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యూనివర్సిటీ వ్యవహారాలను గాడిన పెట్టకపోతే.. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *