జిల్లాల పర్యటనకు కేసీఆర్‌..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిచేందుకు రూట్‌ మ్యాప్‌ రెడీ చేసుకుంటున్నారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 4న బంజారాహిల్స్‌లో ఇంటిగ్రెటెడ్‌ పోలీస్‌ కంట్రోల్‌ అండ్‌ కమాండ్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.వారం పాటు ఢల్లీి పర్యటనలో ఉన్న కేసీఆర్‌ ఆదివారం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయిలో పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తొలగించే చర్యలకు సర్కార్‌ పూనుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వివాదాలకు కారణం అవుతోంది. భూ సమస్యలపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిగిలి ఉన్న భూ సమస్యల పరిష్కారం చూపేలా జులై 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని గతంలో కేసీఆర్‌ నిర్ణయించారు. కానీ భారీ వరదల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిరది. తిరిగి జిల్లాల పర్యటన చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సులపై మరోసారి ఫోకస్‌ పెట్టే అవకాశాలున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో ఏ మేరకు మద్దతు ఉందనే అంశాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తరచూ సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు నివేదికలు సమర్పిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మూడో సారి అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో మరికొన్ని కొత్త పథకాలు అమలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులకు బీమా పథకాన్ని ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అయితే ఈ నేతన్న బీమా స్కీమ్‌ను కేసీఆర్‌ ఏదైనా జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.గోదావరికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్‌ జులై 17వ తేదీన భద్రాచలంలో పర్యటించారు. ఆ తర్వాత అధికారులతో సవిూక్షలు జరిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుండగా అనూహ్యంగా ముఖ్యమంత్రి ఢల్లీి పర్యటన పెట్టుకోవడం సంచలనానికి కారణం అయింది. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం ఢల్లీిలో మకాం వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యారు. వారం తర్వాత ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చినా ప్రతిపక్షాల నుండి విమర్శలు ఆగడం లేదు. అసలు కేసీఆర్‌ ఢల్లీి పర్యటన వెనుక ఉన్న మర్మం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి పార్టీలు. ప్రజల్లోనూ ఈ టూర్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత భావం ఏర్పడటంతో మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లక తప్పదని కేసీఆర్‌ నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. ఇక ప్రతిపక్షాలు సైతం స్పీడ్‌ పెంచిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్‌ పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారట. జిల్లాల పర్యటన ద్వారా వారి విమర్శలకు కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాల పర్యటన విషయంలో అధికారికంగా ఇంకా ప్రకటన రాకపోయినా ఆగస్టులో ఆయన ప్రజల్లోకి వెళ్లబోతున్నారనే టాక్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *