కేసీఆర్‌ కు కలిసి రానున్న బీహార్‌ పరిణామాలు

బీహార్‌ రాజకీయాల్లో జరుగుతున్న నాటకానికి ఎండ్‌ కార్డ్‌ పడిరది. ఊహాగానాలను నిజం చేస్తూ బీజేపీతో ఉన్న ఫ్రెండ్‌ షిప్‌కు నితీష్‌ కుమార్‌ గుడ్‌ బై చెప్పారు. ఇవాళ తన మిత్రుడు బీజేపీకి బైబై చెప్పడంతో పాటు సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా చేశారు. దీంతో బీహార్‌ పాలిటిక్స్‌ మరింత ఉత్కంఠగా మారాయి. అయితే బీహార్‌ రాజకీయ ప్రకంపనలు తెలంగాణ రాజకీయ సర్కిల్స్‌లో చర్చకు దారి తీశాయి. ఎన్డీయే కూటమి నుండి నితీష్‌ కుమార్‌ బయటకు రావడంతో ఈ పరిణామాలు సీఎం కేసీఆర్‌కు ఏ మేరకు కలిసి రానున్నాయనే టాక్‌ నడుస్తోంది.సీఎం కేసీఆర్‌కు బీహార్‌ రాజకీయ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నితీష్‌ కుమార్‌తో పాటు, లాలు ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌తో కేసీఆర్‌కు పరిచయాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ అంశంపై గతంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపాలంటే ప్రతిపక్షంలోని పార్టీలన్నీ తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి కూటమిగా ఏర్పడాలని తేజస్వీ ఆ సమయంలో స్పష్టం చేశారు. తాజాగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నితీష్‌ కుమార్‌ ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్‌ అధినేత్రితో సోనియాతోను ఫోన్‌ కాల్‌ ద్వారా సంప్రదింపులు సాగించారు. ఇటీవల కాలంలో తేజస్వీ యాదవ్‌తో కేసీఆర్‌కు స్నేహం పెరిగింది. ఈ విషయాన్ని అలా ఉంచితే తేజస్వీ యాదవ్‌` నితీష్‌ కుమార్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే ఊహాగానాలు కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో కలిసి వస్తుందనే టాక్‌ జోరుగా వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ చక్రం తిప్పాలనుకుంటున్న వేళ బిహార్‌ రాజకీయంలో మార్పులు చేర్పులు తనకు కలిసి వచ్చేలా కేసీఆర్‌ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారనే టాక్‌ వినవస్తోంది.ఇదిలా ఉంటే మరో వాదన తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బీహార్‌లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ స్కెచ్‌ ఉందనే టాక్‌ వినిపిస్తోంది. నితీష్‌ కుమార్‌ పార్టీపై బీజేపీ కన్ను వేసిందని, జేడీయూ నేతలను బీజేపీలో చేరితే భారీగా డబ్బులు ఇస్తామనే ఆడియో టేపులు నితీష్‌ కుమార్‌కు చేరాయనే ప్రచారం జరుగుతోంది. మిత్రపక్షంలో ఉంటే తననే మోసం చేయాలని బీజేపీ చూస్తోందని నితీష్‌ కుమార్‌ బీజేపీ పెద్దలపై గుర్రుగా ఉన్నాడని అందువల్లే జేడీయూ`బీజేపీ బంధం తెగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే బీహార్‌ రాష్ట్రానికి చెందిన పీకే గతంలో జేడీయూలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత అక్కడి నుండి బయటకు వచ్చి ఆయా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీకి పీకే సేవలు అందిస్తున్న నేపథ్యంలో నితీష్‌ పార్టీపై బీజేపీ చేస్తున్న కుట్రను ఛేదించి పీకేనే నితీష్‌ కుమార్‌కు సాయం చేశాడని టాక్‌ వినిపిస్తోంది. బీజేపీకి చెక్‌ పెట్టేందుకు కేసీఆర్‌, పీకే వేసిన ఎత్తుగడలో భాగమే బీహార్‌ తాజా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని వాదిస్తున్న వారు లేకపోలేరు. బీజేపీని నిలువరించాలంటే సరికొత్త జాతీయ ఎజెండా అవసరం అని కేసీఆర్‌ ఇటీవల కాలంలో చెబుతున్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ పేరుతో తాను సరికొత్త జాతీయ స్థాయి పార్టీ స్థాపించబోతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రశాంత్‌ కిషోర్‌ నుండి అనూహ్య ప్రకటన రావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపింది. తాను కూడా త్వరలో ఓ రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని అది కూడా బీహర్‌ నుండే ప్రారంభిస్తానని చెప్పారు. అక్టోబర్‌ 2 నుండి బీహార్‌ లో తాను పాదయత్ర చేపట్టి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఒక వేళ రాజకీయ పార్టీ పెట్టినా అది ప్రశాంత్‌ కిశోర్‌ది కాదని చివర్లో ఆయన చెప్పడం పొలిటికల్‌ కారిడార్‌లో కొత్త చర్చకు దారి తీసింది. ఆ పార్టీ పీకేది కానప్పుడు మరెవరిది అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అంటే కేసీఆర్‌ చెబుతున్న బీఆర్‌ఎస్‌ గురించే పీకే మాట్లాడారా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ సంగతి అలా ఉంచితే నితీశ్‌ కుమార్‌ ఎన్డీయేకు టాటా చెప్పడంతో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి మరికొంత బలం చేకూరే అవకాశాలు ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.బీహార్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్ని కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ఒక్కటే టీఆర్‌ఎస్‌కు ఆటంకంగా మారింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాటే. ఈ కూటమిలో కాంగ్రెస్‌ ఉండాలని కొందరు వద్దని మరి కొందరు వాదిస్తుండటే విపక్షాల అనైక్యతకు కారణాల్లో ప్రధానమైనది. విపక్షాలతో జత కట్టే విషయంలో కాంగ్రెస్‌ కారణంగా కేసీఆర్‌ వెనకా ముందు అవుతున్నారనే ప్రచారం ఉంది. బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాలంటే కాంగ్రెస్‌ విషయాన్ని పక్కన పెట్టి విపక్షాలకు మరింత చేరువ కావాలనే భావనకు కేసీఆర్‌ వచ్చారనే అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్లే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మిగతా ప్రతిపక్ష పార్టీలు అటుఇటుగా వ్యవహరించినా టీఆర్‌ఎస్‌ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష అభ్యర్థులకే బహిరంగ మద్దతు తెలిపిందనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో బీహార్‌ పరిణామాలను కేసీఆర్‌ నిశితంగా గమనిస్తున్నాడని, తేజస్వీతో ఉన్న పరిచయాలు, పీకే పలుకుబడితో బీహార్‌ నుండే తన బీఆర్‌ఎస్‌ ఆలోచన లేదా ప్రత్యామ్నాయ ఎజెండాను మరో సారి తెరపైకి తీసుకువస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశాలు ఉండటంతో బీహార్‌ పాలిటిక్స్‌ రసకందాయంలోకి చేరడంతో ప్రగతి భవన్‌లో ఏం జరుగుతోందనే టాక్‌ సర్వత్రా ఉత్కంఠకు కారణం అవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *