అవినీతిపై కమిషనర్‌ కొరడా..

మహానగరంలోని కోటిన్నర మందికి అత్యవసర సేవలందించే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మొట్టమొదటి సారిగా కోపమొచ్చింది. లాంగ్‌ స్టాండిరగ్‌ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్ల అవినీతి, పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఈ నెల 17 వరకు సెలవుల్లో ఉన్న కమిషనర్‌ హఠాత్తుగా టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి సీరియస్‌ కావటం సంచలనంగా మారింది.కరోనా కన్నా ముందు 2019లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌ ఇప్పటి వరకు గ్రేటర్‌ నగరంలో ఏ ఘటన జరిగినా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా కనీసం ఘటనాస్థలాన్ని సందర్శించలేదు. అలాంటి కమిషనర్‌కు మొట్టమొదటి సారిగా కోపం రావటం, ఆయన అధికారులకు క్లాసు తీసుకున్నట్లు సమాచారం. గడిచిన మూడున్నరేళ్లలో ఏరోజు కనీసం ప్రశ్నించని ఆయన అధికారులపై ఉన్నట్టుండి ఫైర్‌ కావటం జీహెచ్‌ఎంసీలో చర్చనీయాంశమైంది. పౌర సేవల నిర్వహణ, అభివృద్ధి పనుల పరిశీలన, పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు విధులు నిర్వహిస్తున్న తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన కమిషనర్‌ త్వరలోనే డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లకు సంబంధించిన పలు అధికారాలను కట్‌ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.జీహెచ్‌ఎంసీలో పూర్తిగా అవినీతిమయమైన శానిటేషన్‌ విభాగానికి సంబంధించి డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లపై అనేక రకాల అవినీతి ఆరోపణలున్నాయి. ఈ అవినీతికి చెక్‌ పెట్టేందుకు చాలా సర్కిళ్లలో శానిటేషన్‌ను పర్యవేక్షిస్తున్న మెడికల్‌ ఆఫీసర్లలో కొంతమందిని తమ మాతృశాఖకు సరెండర్‌ చేసి, వారి స్థానంలో ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్లను నియమించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మెడికల్‌ ఆఫీసర్లు చేసిన అక్రమాలనే ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్లు కొనసాగించటం, దానికి డిప్యూటీ కమిషనర్లు వంతపాడటం, వారికి జోనల్‌ కమిషనర్ల అండదండలున్నట్లు కమిషనర్‌ గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవలే 150 మంది శానిటరీ జవాన్లను వార్డు శానిటేషన్‌ ఆఫీసర్లకు నియమిస్తూ ఈ నెల 10న కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో శానిటేషన్‌ మొత్తం బాధ్యతలను వీరికి అప్పగించి, శానిటేషన్‌ వర్కర్ల జీతాలను క్లెయిమ్‌ చేసే అధికారం నుంచి డిప్యూటీ కమిషనర్లను కట్‌ చేస్తారా? లేక మాతృశాఖలకు సరెండర్‌ చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మూడున్నరేళ్లలో ఒక్కసారైనా కమిషనర్‌ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించటం పట్ల అక్రమార్కుల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *