భారత క్రికెట్‌ చరిత్రలో మరుపురాని జ్ఞాపకం

జూన్‌ 25, 1983.. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ తేదీ ఒక సంచలనం. భారత క్రికెట్‌ అభిమానులకు ఒక మరుపురాని జ్ఞాపకం. సరిగ్గా ఇదే తేదీన 40 ఏళ్ల కిందట కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు లార్డ్స్‌ మైదానంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అభేద్యమైన వెస్టిండీస్‌ జట్టును ఫైనల్‌లో మట్టికరిపించి.. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. మొట్టమొదటి విశ్వ క్రికెట్‌ కిరీటాన్ని స్వదేశానికి సగర్వంగా తీసుకొచ్చింది. 40 వసంతాల కిందటి ఈ అద్భుత విజయమే.. భారత క్రికెట్‌ను సమూలంగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఈ ప్రపంచకప్‌ విజయం ప్రపంచ క్రికెట్‌లో భారతదేశ ఉనికిని బలంగా చాటింది. భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఘట్టమిది. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన కపిల్‌ సేన అద్భుతమైన ఆటతీరుతో 17 రోజుల్లో చరిత్రను తిరగరాసి జగజ్జేతగా నిలిచింది. ఆ విజయంతోనే దేశంలో క్రికెట్‌ దశ మారి యువతను క్రికెట్‌ బ్యాట్‌ వైపు మళ్లేలా చేసింది. 1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్‌ 3 మ్యాచ్‌లలో ఒకటే, అదీ ఎవరూ పట్టించుకోని ఈస్ట్‌ ఆఫ్రికాపై గెలిచింది. ఆ తరువాత 1979లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో ఆ విజయం కూడా దక్కకుండా ఇంటి బాట పట్టింది. వరల్డ్‌కప్‌లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్‌ సొంతగడ్డపై 2 మాత్రమే గెలిచి, మిగతా 8 ఓడిరది. ఇలాంటి నేపథ్యంతో బరిలోకి దిగిన 1983 ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. కపిల్‌దేవ్‌ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారనే సామెతనే నిజం చేస్తూ, అందరి లెక్కలను తలకిందులు చేస్తూ తుదిపోరుకు భారత్‌ అర్హత సాధించింది. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్‌ నెగ్గి జోరువిూదున్న వెస్టిండీస్‌తో భారత జట్టు తొలి మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. మైదానంలో దిగాక కపిల్‌ డెవిల్స్‌ విశ్వరూపం ప్రదర్శించింది. అప్పటి వరకు తూర్పుఆఫ్రికా వంటి చిన్న జట్టుపై తప్ప ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గని భారత్‌.. వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించడం మన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.అదే ఊపులో రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడిరచిన కపిల్‌ సేన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ చేతిలో ఘోర పరాజయం పాలైంది. అయినా వెరవక ఆ తరువాత జింబాబ్వేపై అద్భుత విజయం సాధించింది. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కపిల్‌ దేవ్‌ 138 బంతుల్లో 175 నాటౌట్‌Ñ 16 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి ఒంటి చేత్తో ఒడ్డున పడేశాడు. ఆ గెలుపుతో స్ఫూర్తి పొందిన భారత్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి సెవిూఫైనల్లో అడుగుపెట్టింది. సెవిూస్‌లో ఇంగ్లండ్‌ను ఓడిరచి తొలిసారి వరల్డ్‌ కప్‌ లో ఫైనల్‌ కు చేరింది టీమ్‌ఇండియా. జూన్‌ 25న జరిగిన ఫైనల్లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కపిల్‌ సేన ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్నే ఉంచినా స్ఫూర్తిదాయక బౌలింగ్‌కు తోడు కపిల్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలతో విశ్వవిజేతగా నిలిచింది. విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను దాదాపు 20 అడుగుల దూరం వెనక్కి పరిగెడుతూ కపిల్‌ దేవ్‌ అందుకోవడంతో స్టేడియం మారుమోగిపోయింది. ముందుగా బ్యాటింగ్‌ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్‌ డెవిల్స్‌ మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. తమ సర్వశక్తులూ ఒడ్డి వెస్టిండీస్‌ జట్టును 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన క్షణాన లార్డ్స్‌ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *