పనబాక…కర్చీఫ్‌ వేసేసుకున్నారా

రాబోయే ఎలక్షన్స్‌లో కచ్చితంగా బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి కొత్త అబ్యర్థే రంగంలోకి దిగుతారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎంపీ ఇక్కడ నుంచి తిరిగి పోటీ చేయడానికి ఆసక్తి కనబరచడం లేదు. మాజీ మంత్రి మాత్రం పార్టీ ఆదేశిస్తే తాను పోటీకి సిద్దమంటున్నారు. ఈ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గంపై పలువురు దళిత నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి కొత్త మొఖాలే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని మాత్రం భావిస్తున్నారు.బాపట్ల లోక్‌ సభ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరూ బరిలోకి దిగుతారా అన్న అంశంపై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసిపి నుంచి నందిగం సురేష్‌ బరిలోకి దిగారు. టిడిపి నుంచి మాల్యాద్రి పోటీ చేసి సురేష్‌ చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత మాల్యాద్రి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గెలిచిన సురేష్‌ కూడా నియోజకవర్గంలో పర్యటించడం లేదని టాక్‌ నడుస్తోంది. గెలిచిన నాటి నుంచి కూడా సురేష్‌ను అనేక వివాదాలు వెంటాడుతున్నాయి. ఈయన రాజకీయాలు తాడికొండ ప్రాంతానికే పరిమితమయ్యాయి అనే వారు లేకపోలేదు. ఏంపీగా పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గళం వినిపించడంలో విఫలమయ్యారని పోలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఈ వివాదాలతో విసిగిపోయిన ఎంపీ నందిగం సురేష్‌ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులు ఎవరూ అని పార్లమెంటు పరిధిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.. పలానా వ్యక్తి ఇక్కడ నుంచి పోటీ చేస్తారంటూ ఓ పుకారు వదిలి జనం రియాక్షన్‌ తెలుసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం బాపట్లలో టిడిపి నేత మాజీ ఎంపీ పనబాక లక్ష్మీ పర్యటించారు. అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తాననటంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడేక్కాయి. పనబాక లక్ష్మి కాంగ్రెస్‌ తరఫున 2004, 2009లో బాపట్ల ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె కాంగ్రెస్‌ పార్టీని వీడి టిడిపిలో చేరారు. తిరుపతి ఉపఎన్నికల్లో టిడిపి టికెట్‌పై పోటీ చేసిన ఆమె ఓడిపోయారు.ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై అనుచరులతో చర్చించి బాపట్ల సేఫ్‌ నియోజకవర్గంగా ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బాపట్లలో పర్యటించిన ఆమె అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్దమని ప్రకటించారు. నియోజకవర్గంలో ఆమెకు మంచి పట్టు ఉంది. అంతేకాకుండా పొత్తులు కూడా ఉండే అవకాశం ఉండటంతో గెలుపు సులభమే అన్న ప్రచారం జరుగుతోంది.వచ్చే ఎన్ని కల్లో పోటీ చేసే వైసిపి అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. నందిగాం సురేష్‌ పోటీ చేస్తారా లేక మరొక అభ్యర్థా అన్న ప్రచారంపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం కనిపించటం లేదు. కొత్త అభ్యర్థే బరిలో ఉంటారని స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు. తొందరగా అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వాలని కూడా కార్యకర్తలు కోరుకుంటున్నారు. కార్యకర్తల అభ్యర్థనపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *