గన్నవరం సీట్‌ కాస్ట్‌ లీ గురూ…!

గన్నవరం టిక్కెట్‌ కోసం రూ.150 కోట్లు ఖర్చు పెడతామంటూ ఒక వ్యక్తి తనను సంప్రదించారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గన్నవరం సీట్‌ కోసం అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందా అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ మెదలైంది.గన్నవరం సీట్‌ చాలా కాస్ట్‌ లీగా మారిందా… సింగిల్‌ హ్యాండ్‌ తో 150కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదని ప్రతిపక్ష పార్టీ చెబుతుంటే, అధికార పక్షం మాటేంటి.. ఇలాంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా… అసెంబ్లి సీట్‌ లో ఎమ్మెల్యేగా గెలవాలంటే అన్ని కోట్లు ఖర్చు చేయాల్సిందేనా.. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటని సందేహాలు ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నీయాశంగా మారాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని గన్నవరంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేత, మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్గా మారాయి. తెలుగుదేశం పార్టీ తరపున గన్నవరం సీట్‌ ను ఇప్పిస్తే 150కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఒ వ్యక్తి తనను సంప్రదించారని చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. అయితే అందుకు తాను అంగీకరించలేదన్నారు. దమ్మున్న నాయకుడు కావాలి కాని, కోట్లు ఖర్చు చేసేవాడు అవసరం లేదని చెప్పానని తెలిపారు. మరోవైపున అంత డబ్బు ఇస్తానన్న వ్యక్తి పేరు మాత్రం తాను చెప్పనని చింతమనేని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పొలిటికల్‌ సర్కిల్‌ లో అగ్గి రాజేశాయి. తెలగు దేశం పార్టీ గన్నవరం సీటుకు 150కోట్లు ఆఫర్‌ చేస్తే, ఇక అదికార పార్టికి చెందిన సీట్‌ కోసం అయితే ఎంత డిమాండ్‌ ఉంటుందో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగా సీటు కోసం అంత డిమాండ్‌ ఉంటే, ఖర్చు చేసిన నాయకుడు ఓటమి పాలయితే అతన్ని ఎవరు ఆదుకుంటారని అధికార, విపక్షాలలో చర్చ మొదలైంది.చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. చింతమనేని వ్యాఖ్యలపై స్పందించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చింతమనేని తన ఊరిలో తన పని చేసుకోవాలని సూచించారు. మంగమ్మ శపథాలు చేయటం మానుకోవాలన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి, నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్‌ విూద ఉందా లేక 151 మంది గెలిచిన పార్టీ వెంటిలేటర్‌ పైన ఉందో చెప్పాలన్నారు. పోయే కాలం వచ్చిన వాళ్లు .. వాళ్లు పోయారు వీళ్లు పోయారంటూ అరుస్తుంటారని వంశీ ఎద్దేవా చేశారు. 74 ఏళ్లు వచ్చిన చంద్రబాబుకు పరిణతి రాలేదని, ఇంకా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. గన్నవరంలో చంద్రబాబు గానీ లోకేష్‌ గానీ పోటీ చేయాలని నేను చాలా సార్లు డైరక్ట్‌ గా చెప్పానని సవాల్‌ చేశారు. ఎక్కడ నుండో ఇక్కడకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం సమంజనం కాదని చెప్పారు.ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలపై తెలుగుదేశం నేతలు పూర్తిగా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే ఈ రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరం అయిన అన్ని మార్గాలను తెలుగు దేశం అన్వేషిస్తోంది. పార్టీకి పూర్తిగా కట్టుబడి ఉండే అభ్యర్దులు, రాజకీయంగా వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే వారిని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గన్నవరంలో సిట్టింగ్‌ శాసన సభ్యుడు వల్లభనేని వంశీ, గుడివాడ శాసనసభ్యుడిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ గెలవనీయకూడదనే ఉద్దేశంతోనే తెలుగు దేశం నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *