మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈజిప్టు (Egypt) పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ”ఆర్డర్ ఆఫ్ ది నైల్” (Order of the Nile) అందుకున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌-సిసి (Abdel Fattah El-Sisi) ఈ పురస్కారాన్నికి మోదికి అందజేశారు. ఈ అవార్డును తనకు అందించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈజిప్టులో మోదీ అధికారికంగా తొలిసారి పర్యటిస్తుండగా, 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటిస్తుండటం ఇది మొదటిసారి.

ఈజిప్టు, భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ ఈ పర్యటన సాగిస్తున్నారు. శనివారంనాడు ఈజిప్టులో మోదీ పర్యటన ప్రారంభించగా, ఆయనకు ఈజిప్టు ప్రధాని మోస్తఫా మద్‌బౌలీ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఈజిప్టు సేనల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గత ఏడాది గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరైన అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోదీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా, మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు కామన్‌వెల్త్ వార్ గ్రేవ్ సిమిట్రీలో నిర్మించిన స్మారకాన్ని మోదీ సందర్శించి, అమరవీరులకు నివాళులర్పించారు.

అల్ హకీమ్ మసీదును సందర్శించిన మోదీ

ఈజిప్టులో 11వ శతాబ్దపు నాటి అల్-హకీం (Al-Hakim) మసీదును ప్రధానమంత్రి మోదీ ఆదివారంనాడు సందర్శించారు. దవూది బోహ్రా కమ్యూనిటీ సహకారంతో ఈ మసీదును పునరుద్ధరించారు. భారత్, ఈజిప్టు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ మసీదు నిలుస్తుంది. కాగా, ప్రధాని తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మద్ బౌలీ, ఆయన క్యాబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఎంఓయూలపై సంతకాలు చేశారు. ప్రవాస భారతీయులను, బోహ్రా కమ్యూనిటీ సభ్యులను కూడా కలుసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *