అమెరికాలో కాల్పులు.. ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి

వాషింగ్టన్‌: అమెరికాలో(America) గన్ కల్చర్(Gun Culture) మళ్లీ పెచ్చుమీరుతోంది. తాజాగా భారతీయ విద్యార్థి వెళ్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో విద్యార్థి విగతజీవిగా మారాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ కి చెందిన ఆదిత్య(26) అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాట్‌ మెడికల్ స్కూల్‌లో చదువుతున్నాడు. వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అతన్ని పోలీసులు యూసీ మెడికల్ సెంటర్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.

దుండగుడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అతని మృతిపై అతను చదువుతున్న కాలేజీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉత్తర భారత్‌కు చెందిన ఆదిత్య 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు.

2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. అనంతరం వైద్య విద్యలో ఉన్నత చదువుల నిమిత్తం యూఎస్ వెళ్లిపోయాడు. కాల్పుల ఘటన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *