నల్లారికి కమలం పగ్గాలు

ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ లో కీలక పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజనకు ముందు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన అధిష్ఠానాన్ని ధిక్కరించి కాంగ్రెస్‌ ను వీడి సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో ఆ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపారు. సీన్‌ కట్‌ చేస్తే సమైక్యాంధ్ర పార్టీ 2014 ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. పార్టీ అధినేత కిరణ్‌ కుమార్‌ రెడ్డి సహా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎవరికీ కనీసం డిపాజిట్‌ కూడా రాలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన నాలుగేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ పిలుపుతో ఆయన మళ్లీ సొంత గూటికి చేరారు. అయినా కూడా మౌనం వీడలేదు. ఇక అయన రాజకీయాలకు దూరమైనట్లేనని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన మరోసారి కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. ఆయన బీజేపీ తరఫున కర్నాటకలో ప్రచారం కూడా చేశారు.అయితే కర్నాటక ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. మళ్లీ షరామూములే. కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి మౌనముద్ర వహించి అమెరికా పర్యటనకు వెళ్లారు. అది వ్యక్తిగత పర్యటన అంటూ ఆయన త్వరలోనూ తిరిగి వచ్చి బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తానని కిరణ్‌ కుమార్‌ రెడ్డి అక్కడ నుంచే ఓ ప్రకటన విడుదల చేశారు. అంతే తప్ప రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి కానీ, ఏపీలో అధికారంలో ఉన్న జగన్‌ సర్కార్‌ తీరుపై కానీ, విపక్ష తెలుగుదేశం కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్న నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.సీనియర్‌ నాయకుడైన కిరణ్‌ కుమార్‌ రెడ్డి నుంచి సూచనలూ, సలహాలూ స్వీకరించేందుకే కలిసినట్లు సోము వీర్రాజు చెప్పుకున్నారు. అదలా ఉంచితే.. ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ గత కొంత కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు రాష్ట్ర పార్టీ పగ్గాలను తొలుత కన్నా లక్ష్మీనారాయణకు, ఆయన తరువాత సోము వీర్రాజుకు అప్పగించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.దీంతో సోము స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకులే కాకుండా పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా జగన్‌ సర్కార్‌ పై విమర్శల దాడి పెంచడం, ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌ లు విడుదల చేయడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నల్లారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో వైసీసీకి అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందన్నది బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *