అసమ్మతి గులాబీలు

ఆసమ్మతి ఆరని మంటలా తయారైంది. గులాబీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. జిల్లాల వారిగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎక్కడికక్కడ అసమ్మతి బహిర్గతమవుతోంది. విభేదాలు ముదిరి నేతలు బహిరంగ సవాళ్లు, విమర్శల పర్వానికి దిగుతున్నారు. అసమ్మతి మంటల కారణంగానే ప్రజాప్రతినిధులు వివాదాలపాలవుతుంటే.. మరో వైపు మంత్రులపై కేసులు నమోదై, నోటీసులు జారీ అవుతున్నాయి. పార్టీ నేతల్లో అసమ్మతి నివురు తొలగిపోయి నిప్పులా పార్టీని కాల్చేస్తోంది. నేతలు రోడ్డెక్కి ఆరోపణల పర్వానికి దిగుతూ పార్టీకి ప్రతిష్టను మంటగలుపుతున్నారు. వరంగల్‌, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మేడ్చెల్‌ మల్కాజిగిరి..ఇలా ఏ జిల్లాలో చూసినా పార్టీ నేతల మధ్య విభేధాలు, వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితే కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో తనకే టిక్కెట్టు వస్తుందనీ, తానే పోటీ చేస్తాననీ నియోజకవర్గాల్లోని నేతలు బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారు, ఆశావాహులు అందరూ అదే బాట పడుతున్నారు. దీంతో టిఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు నువ్వా నేనా..? అనే స్థాయికి చేరుకుంటున్నది. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలను కాదని తమకే టిక్కెట్టు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్‌ ఒకింత గందర గోళానికి గురవుతోంది నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వేముల ప్రశాంత్‌ కు వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలు ఎమ్మెల్యే టిక్కెట్టు నాదంటే నాదనేది ప్రకటించుకుంటున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఆధిపత్యం పోరు ముదురుతోంది. ఇన్నాళ్లు ఇద్దరి మధ్య విభేదాలు బయటికి పెద్దగా కనబడక పోయినా ఇప్పుడు ముదిరి పాకానపడ్డాయి. అయితే వీరిద్దరి మధ్య వార్‌ కొత్తేవిూ కాదు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ నుంచి కారెక్కిన నాటి నుంచి ఈ ఇద్దరికి ఎప్పుడూ పోసిగేది కాదు. అలా అని వీరిద్దరూ ఏనాడు ఎదురుపడి గొడవ పెట్టుకున్న సందర్భాలు లేవు. ఆధిపత్య పోరులో బహిర్గతంగా తొడ కొట్టుకున్న దాఖలాలూ లేవు. అంతర్గతంగా మాత్రం పోరు మామూలుగా ఉండదు. అది ఏ రేంజ్‌ లో అంటే నకిరేకల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పట్టున్నా ఇక్కడ జరిగే లోకల్‌ ఎలక్షన్స్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ అభ్యర్దే పోటీ ఇచ్చేంతగా ఉంది.తాండూర్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిల మధ్య విభేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు నాదంటే నాదేనని ప్రకటించుకోవడంతో పాటు పరస్పర విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పోలీసు అధికారిని దుర్భాషాలడారు. అది కాస్త వైరల్‌ అయ్యింది. చివరకు ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి పొరపాటున అన్నాననే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టిఆర్‌ఎస్‌ లో చేరడంతో తీగల కృష్ణారెడ్డి తెరమరుగయ్యారు. ఆయన కూడా అసమ్మతితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మేడ్చెల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే ఉప్పల్‌ నియోజకవర్గంలో బండారి లక్ష్మారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, హైదరాబాద్‌ నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ల మధ్య టిక్కెట్టు పోరు నడుస్తోంది. మేడ్చెల్‌ లో మంత్రి మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి వర్గీయుల మధ్య పోరునడుస్తోంది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గపు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి, జిల్లా చైర్మన్‌ కు మధ్య వివాదాలు బలంగా ఉన్నాయి. భువనగిరి అసెంబ్లీకి ప్రాతినథ్యం వహిస్తున్న ఫైళ్ళ శేఖర్‌ రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌ రెడ్డిల నడుమ వివాదాలు పెరుతుగుతున్నాయి. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ కు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుకు మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్‌ లో ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గానికి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి ల మధ్య పచ్చిగడ్డి వేస్తే మండేలా తయరయ్యారనే ప్రచారం జోరందుకుంది. ఈ విధంగా అధిక శాతం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుంటున్న పార్టీ అదినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు నేతల మధ్య విభేదాలు కొత్త తలనొప్పిని తీసుకువచ్చాయి,జాతీయ రాజకీయాలు కాదు..ముందు పార్టీని చక్కదిద్దుకోవలసిన పరిస్థితి అనివార్యమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *