మరో కార్యక్రమంతో జగన్‌ సర్కార్‌

తిరుపతి, అక్టోబరు 9
ఇప్పటిదాకా అనేక రూపాల్లో వైసీపీ ప్రచారం చేపట్టింది. ఇక నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ పేరిట మరోసారి ప్రజల వద్దకు వెళ్తోంది. మొన్న ఇంటి తలుపులపై స్టిక్కర్లు వేశారు. ఈసారి ఇంటిపై వైసీపీ జెండా ఎగరేయాలని అడగనున్నారు. సీఎం జగన్‌కు రుణపడి ఉన్నట్లు సంతకాలు సేకరించనున్నారు. వాలంటీర్లతో ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని ఐప్యాక్‌ నిర్దేశించినట్లు సమాచారం. ఇప్పటికే విూకు ప్రభుత్వం నుంచి ఇంత లబ్ధి చేకూరిందంటూ చేస్తోన్న ప్రచారంతో ప్రజలు విసుగెత్తారు. స్టిక్కర్లు వేస్తామంటేనే అయిష్టంగా ఒప్పుకొని తర్వాత పీకేశారు. ఇప్పుడు ఏకంగా ఇంటిపై పార్టీ జెండాలు ఎగరేయాలంటే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందో అర్థంగాక వలంటీర్లు తలలు పట్టుకుంటున్నారు.వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, సిబ్బంది అధికార వైసీపీ ప్రచారంలో తలమునకలవుతున్నారు. ఈ సైన్యం మొత్తాన్ని నిరంతరం ప్రజల్లో ఉంచాలని సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు కార్యాచరణను నిర్దేశిస్తున్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరిట ప్రతి కుటుంబానికీ ఎంత లబ్ధి చేకూరిందనే వివరాలు వెల్లడిస్తూ ఓ సారి జనం వద్దకు వెళ్లారు. అప్పుడే ఈ సొమ్మంతా విూ జేబుల్లో నుంచి ఇస్తున్నారా? అని ప్రజలు ఎదురు దాడి చేసిన సందర్భాలున్నాయి. పథకాల ద్వారా విూరిచ్చేదెంత.. ధరల పెంపు, వివిధ రకాల పన్నులతో గుంజేదెంత? అని ప్రజా ప్రతినిధులను నిలదీసిన ఘటనలకు కొదవ లేదు.తర్వాత ‘జగనే మా భవిష్యత్తు’ అంటూ ఇంటింటికీ సీఎం జగన్‌ స్టిక్కర్లను అతికించే కార్యక్రమాన్ని చేపట్టారు. కాదంటే ఎక్కడ పథకాలు నిలిపేస్తారోనని లబ్ధిదారులు మౌనం వహించారు. వాలంటీరు స్టిక్కర్‌ అంటించి వెళ్లాక పీకేశారు. ప్రభుత్వం నుంచి విూ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరిందటగా అంటూ గ్రామాల్లో ఇరుగు పొరుగు ఎగతాళి చేస్తుండడంతో పథకాల లబ్ధిదారులు తలదించుకొని మారు మాట్లాడకుండా పక్కకు పోతున్నారు. కొందరైతే ఎదురు తిరిగారు. ఎవడబ్బ సొమ్ము ఇస్తున్నారంటూ? అధికార పార్టీ నేతలను దుమ్మెత్తి పోశారు. ఇంటి ముందు గుంతల రోడ్లు, రోడ్డు విూదే పారుతున్న మురుగు నీరు చూపించి ప్రజాప్రతినిధుల పరువు దీశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచేశాయి. వంట గ్యాస్ధర మండిపోతోంది. నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు బాదేస్తున్నారు. నిరంతరం పెరుగుతున్న కరెంటు బిల్లులు, రవాణా చార్జీలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆస్తి, ఇంటి పన్నులు మోతమోగిస్తున్నాయి. వీటితో సతమతమవుతున్న జనం వద్దకు వెళ్లి మరోసారి ఇంటిపై జెండా ఎగరేయమని చెప్పాలంటే వాలంటీర్లు సైతం జంకుతున్నారు.సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని సంతకాలు సేకరించాలంటున్నారు. అసలే కారాలు మిరియాలు నూరుతున్న ప్రజల వద్దకు వెళ్లి ఇవన్నీ అడిగితే ఎలా స్పందిస్తారోనని వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు జంకుతున్నారు. వైసీపీలో పెరుగుతున్న అభద్రతా భావానికి తాము ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *