చెరువులు, కుంటలు వదలని అక్రమార్కులు

అక్రమార్కులు ప్రభుత్వ భూములనే కాదు.. చెరువులను, కుంటలను కూడా వదలకుండా కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాదేదీ.. కబ్జాకు అనర్హం… అన్నట్లు హయత్‌నగర్‌ మండల బాగ్‌ హయత్‌నగర్‌ రెవెన్యూ పరిధిలోని హాతిగూడ కుంటపై కొందరు అధికార పార్టీ నేతల కన్ను పడిరది. రెండు నెలల క్రితమే కుంట బఫర్‌ జోన్‌లో బోరు కూడా వేశారు. వరుస సెలవులు రావడంతో శుక్రవారం అర్థరాత్రి మరోసారి గుట్టుచప్పుడు కాకుండా మట్టిపోసి అక్రమించేందుక విఫల యత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అర్థ భాగంపైగా కుంటను మింగిన అధికార పార్టీ నేతుల, రియల్‌ వ్యాపారులు రాత్రికి రాత్రే మట్టితో రోడ్డు కూడా వేశారు. ఇందుకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువులు, కుంటల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.హయత్‌నగర్‌, అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలాల పరిధిలోని బాగ్‌ హయత్‌నగర్‌, కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని హాతిగూడ కుంటపై కొంత మంది స్థానిక అధికార పార్టీ నేతల కన్నుపడిరది. ఇంకేముంది రాత్రికి రాత్రే లారీలతో మట్టిపోసి చదును చేసి హద్దురాళ్లు పాతేశారు. రెండు మండలాల పరిధిలో కుంట ఉండడంతో కబ్జారాయుళ్లకు ఆడిరదే ఆట.. పాడిరతే పాటగా మారింది. ఇదే అదునుగా అధికార పార్టీకి చెందిన స్థానిక డివిజన్‌ నాయకుడు బాగ్‌ హయత్‌నగర్‌ సర్వేనంబర్‌ 97, 98లోని బఫర్‌జోన్‌ పరిధిలో వెంచర్‌ చేసి అమ్మెశాడు. దీంతో అక్కడ ఇండ్లు కూడా వెలిశాయి.మిగిలిన కొద్దిపాటి కుంటను కూడా మింగేందుకు మట్టిపోసి చదును చేస్తున్నాడు.. అంతకు ముందే కుంట శిఖం భూమిలో ఏకంగా బోరుకూడా వేశాడు. వీరన్నగుట్ట రోడ్డు నుండి కుంటలోకి వెళ్లేందుకు 30 ఫీట్ల మట్టి రోడ్డును నిర్మించాడు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల అండదండలతో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు కుయుక్తులు పన్నుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నా ఇరిగేషన్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వారి పనితీరుకు నిదర్శనం ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలో 26కు పైగా చెరువులు ఉండగా ప్రస్తుతం అవి ఏ స్థితిలో ఉన్నాయో కూడా వారికి పట్టడం లేదు. హాతిగూడ కుంట పరిస్థితి చూస్తే అదే తేటతెల్లం అవుతోంది. రికార్డుల ప్రకారం 12.26 ఎకరాలుగా ఉన్న దీని విస్తీర్ణం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కి కుచించుకుపోయింది. ఇక బాగ్‌ హయత్‌నగర్‌ సర్వే నంబర్‌ 97,98 కుంట బఫర్‌ జోన్‌లో ఉంటుంది. ఈ బఫర్‌ జోన్‌లో అక్రమార్కులు ప్లాట్‌లు చేసి హద్దురాళ్లు పాతడం గమనార్హం. అయినా ఇరిగేషన్‌ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ తీసుకున్న చర్యలు శూన్యం. చెరువులు, కుంటల విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని పలువురు సామాజిక వేత్తలు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల పాత్ర పరోక్షంగా ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. హాతిగూడ కుంటలో బోరు వేసినా అధికారులు తొలగించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు కబ్జారాయుళ్లకు అనుకూలంగా మార్గం సుగమం చేస్తున్నారనే పలువురు విమర్శిస్తున్నారు. ఇతంతా పథకం ప్రకారం అధికారుల కనుసన్నల్లోనే జరుగుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అధికారులకు ఎటువంటి సంబంధం లేకుండా వెంటనే కబ్జాదారులపై భూ కబ్జా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చెరువులను, కుంటలను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *