ప్రతిపక్షాల ట్రాప్‌ లో కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ విసిరిన ‘ముందస్తు ఎన్నికల’ సవాలు ఆయన మెడకే చుట్టుకున్నది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించాయి. తక్షణం కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రతిసవాల్‌ విసిరాయి. విపక్షాల డిమాండ్‌కు తలొగ్గిన కేసీఆర్‌.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? ఒక రాజకీయ ప్రకటనగానే సరిపెడతారా? తొలుత డేట్‌ ఫిక్స్‌ చేయాలనే వాదనను తెరపైకి తెస్తారా? 2018 తరహాలోనే ఇప్పుడూ ముందస్తుకు వెళ్తారా? లేక ప్రతిపక్షాలను ట్రాప్‌లో పడేసే సరికొత్త వ్యూహాన్ని అవలంభిస్తారా? ఇవీ ఇప్పుడు జరుగుతున్న చర్చలు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన సవాల్‌ రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించింది. ‘‘వాళ్ళకంత (బీజేపీని ఉద్దేశించి) దమ్ముంటే ఎన్నికల డేట్‌ను ఫిక్స్‌ చేయమనండి. నేనే అసెంబ్లీని రద్దు చేస్తా.. అందరం కలిసి ఎన్నికలకు పోదాం.. ఒకవేళ ముందస్తుకు పోతే కేసీఆర్‌ను తట్టుకుంటారా..’’ అంటూ సీఎం కేసీఆర్‌ విూడియా సమావేశంలో ఆదివారం రాత్రి కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే రెండు అపోజిషన్‌ పార్టీలు స్పందించాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం కేసీఆర్‌ వంతు అయింది. బాల్‌ను కేసీఆర్‌ కోర్టులోకి విసిరిన రెండు పార్టీలూ.. ముందస్తు సిద్ధమంటూ క్లారిటీ ఇచ్చాయి. కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నాయి. కేసీఆర్‌ తీసుకునే నిర్ణయమే ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌.. అసెంబ్లీని రద్దు చేయకపోతే డేట్‌ ఎలా ఫిక్స్‌ అవుతుందంటూ రెండు పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ రద్దయినట్లు గెజిట్‌ జారీ అయితే కేంద్ర ఎన్నికల సంఘమే ఎన్నికల తేదీని ఫిక్స్‌ చేస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ రద్దే కాకపోతే డేట్‌ ఎలా ఫిక్స్‌ అవుతుందని ప్రశ్నించారు. రాజ్యాంగంపై కనీసమైన అవగాహన కూడా లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు విపక్ష పార్టీల నుంచి అసెంబ్లీ రద్దుకు డిమాండ్‌ పెరుగుతుండడంతో కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. రాజకీయ ప్రకటన కోసం కేసీఆర్‌ ‘ముందస్తు’ వ్యాఖ్యలు చేశారా? లేక నిజంగానే ఆ దిశగా వెళ్లడానికి విపక్షాలను ఉచ్చులోకి లాగారా? అనేది చర్చనీయాంశమైంది. చివరకు అసెంబ్లీ రద్దు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్నది,ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి ఘాటుగానే స్పందించారు. మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తీసుకోడానికి ముఖ్యమంత్రికి నాలుగు రోజుల డెడ్‌లైన్‌ విధించారు. కేసీఆర్‌ నిజంగా నిఖార్సయిన ఉద్యమకారుడే అయితే, పోరాట పటిమే ఉంటే నాలుగు రోజుల వ్యవధిలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. విూడియా సమావేశం సాక్షిగా విసిరిన సవాల్‌కు కేసీఆర్‌ కట్టుబడి ఉండాలని, నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. ప్రజలు సైతం టీఆర్‌ఎస్‌ సర్కారును ఇంటికి సాగనంపాలని ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సైతం ఘాటుగానే స్పందించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘సవాల్‌ చేయడం కాదు.. తొలుత అసెంబ్లీ రద్దు చేయ్‌..’అంటూ సవాల్‌ విసిరారు. శాసనసభ రద్దయితే ఆటోమెటిక్‌గా ఎన్నికలు వస్తాయని, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం.. నిజంగా కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామన్నారు.కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల సవాల్‌ను స్వీకరిస్తున్నామని బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉన్నదని, గతంలోనే తాము స్పష్టం చేశామన్నారు. ఎన్నికల డేట్‌ను ఫిక్స్‌ చేసేది ఎన్నికల సంఘమని గుర్తుచేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు తాము చెప్తే జరిగాయా.. ఎన్నికల తేదీలను తమ పార్టీ ఫిక్స్‌ చేసిందా.. అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. బీజేపీని దోషిగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాన్ని కేసీఆర్‌ చేస్తున్నారని, నిజంగా ఆయన సవాలు చిత్తశుద్ధితో కూడుకున్నదే అయితే తక్షణం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని, మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ రాత్రిపూట చేసే సవాళ్లను ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సైతం అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్దామని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. ఆ పార్టీకి చెందిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధమని, కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమన్నారఅసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా టీఆర్‌ఎస్‌ నేతల్లో మాత్రం సరికొత్త గుబులు పుడుతున్నది. అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలు వస్తాయా? లేక రాష్ట్రపతి పాలన వస్తుందా? అనేది వారికి మింగుడుపడడంలేదు. మొదటి టర్ములో కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు ఉండడంతో తొమ్మిది నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో ఆరు నెలల ముందే ఎన్నికలు వచ్చాయి. ఈసారి బీజేపీతో రాజకీయ యుద్దం కొనసాగిస్తున్నందున ఎన్నికలు వస్తాయా? లేక రాష్ట్రపతి పాలన వస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తే అడ్మినిస్ట్రేషన్‌ మొత్తం గవర్నర్‌ చేతుల్లోకి వెళ్తుందని, అనుకూల పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతాయన్న భయం అధికార పార్టీ నేతలను వెంటాడుతున్నది. దీంతో విపక్షాల ఉచ్చులో పడకుండా ఏ వైఖరి తీసుకోవాలన్నది ఇప్పుడు కేసీఆర్‌కు చాలెంజ్‌గా మారింది. ‘ముందస్తు’ సవాల్‌ విసిరిన కేసీఆర్‌ తన మాటలకు కట్టుబడి ఉంటారా? అసెంబ్లీని రద్దు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు తలొగ్గుతారా? రాష్ట్రపతి పాలన విధిస్తారేమోననే సందేహాల నడుమ పక్కకు పెడతారా?.. ఇవీ ఇప్పుడు రాజకీయ పార్టీల నేతల మధ్య జరుగుతున్న చర్చమొదటి టర్ము తరహాలోనే రెండో దఫా కూడా తొలుత ముందస్తు ప్రతిపాదన తెచ్చింది ముఖ్యమంత్రే. కానీ హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు తర్వాత, ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీల తర్వాత ‘‘ముందస్తూ లేదు.. వెనకస్తూ లేదు.. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి..’’ అంటూ వేర్వేరు సందర్భాల్లో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మరోసారి ముందస్తు ప్రస్తావన చేసిన కేసీఆర్‌ రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న సవాళ్లు `ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *