వరుస సర్వేల్లో నేతలు

వరంగల్‌, జూన్‌ 3
వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వొద్దు.. అని తేల్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ వరుస సర్వేలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తమకు టికెట్‌ వస్తుందో రాదోననే అనుమానంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులూ తమ నియోజక వర్గాల్లో సొంత సర్వేలు చేయించుకుంటున్నారు.లోకల్‌గా తమకు ఎలాంటి అనుకూల పరిస్థితులున్నాయి?.. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?.. తనకంటే బలమైన ప్రత్యర్థి ఎవరు?.. సొంత పార్టీలో తనకు బదులుగా ఎవరి పట్ల ప్రజలు ఆసక్తిగా ఉన్నారు?.. ఏ అంశాలు ప్రజల్లో ప్రభావం చూపిస్తున్నాయి?.. వంటి వివరాలు తెలుసుకునేందుకు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. దీనికి థర్డ్‌ పార్టీ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. వారిచ్చే ఫీడ్‌ బ్యాక్‌తో పని తీరు మార్చుకుంటున్నారు. టికెట్‌ తప్పనిసరిగా వచ్చేలా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు.ఎమ్మెల్యేల పనితీరుపై బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న సర్వేల వివరాలను అధిష్టానం గోప్యంగానే ఉంచుతున్నది. నెగెటివ్‌ ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నది. దీంతో చాలా మంది ఎమ్మెల్యేల్లో గందరగోళం ఏర్పడిరది. నిజంగా పార్టీ పెద్దలు చెబుతున్నట్టుగానే ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత వ్యక్తమైందా?.. లేక ఉద్దేశపూర్వకంగా టికెట్‌ ఇవ్వకూడదనే నిర్ణయంతో సర్వేను సాకుగా చూపుతున్నదా?.. ఈ విషయాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు సొంత సర్వేలపై ఆధారపడుతున్నారు.గ్రామాల్లో తమ గురించి ఓటర్లు ఏమనుకుంటున్నారు?.. వ్యక్తిగతంగా అసంతృప్తి, వ్యతిరేకత ఏ మేరకు ఉంది?.. వంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మరోవైపు ఆశావహులు సైతం సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత తమకు ఏ మేరకు కలిసొస్తుందో స్వయంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.సర్వే నిర్వహిస్తున్న ఏజెన్సీలు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లోని ఓటర్ల మొబైల్‌ ఫోన్లకు కాల్స్‌ చేస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?.. ఆయనకు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారా?.. వేయకపోతే కారణమేంటి?.. వ్యక్తిగతంగా ఇష్టపడడంలేదా?.. లేక పార్టీయే నచ్చలేదా?.. ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్‌?.. ఏ పార్టీ అంటే ఇష్టం?.. అనే విషయాలు తెలుసుకునేందుకు ఫోన్‌లు చేస్తున్నాయి. ప్రీ రికార్డెడ్‌ వాయిస్‌ మెసేజ్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నాయి.‘ఎమ్మెల్యే పనితీరు ఆప్షన్లు ఇచ్చి ఆ నంబర్‌ను నొక్కండి’ అంటూ సూచిస్తున్నాయి. ఓటర్ల ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఆయా లీడర్లపై ప్రజల అభిప్రాయాలతో థర్డ్‌ పార్టీ ఏజెన్సీలు రిపోర్టు తయారు చేసి అందిస్తున్నాయి. వాయిస్‌ మెసేజ్‌కు రెస్పాండ్‌ అయిన ఓటర్లు ఏ గ్రామం వారు? వారు ఎందుకు ఆ విధంగా రెస్పాండ్‌ అయ్యారో తెలుసుకుని, తమ పనితీరు మెరుగు పరుచుకొని, ఆ గ్రామాల్లో పరిస్థితిని చక్కదిద్దుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.సొంతంగా చేయించుకున్న సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో గెలిచే చాన్స్‌ ఏ మేరకు ఉందో అంచనాకు వస్తున్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌లో టికెట్‌ రాకపోయినా, వచ్చినా ఓడిపోయే ఛాన్స్‌ ఉందంటూ నివేదికలో వెల్లడైనా ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయో విశ్లేషించుకుంటున్నారు. పార్టీ నిర్వహించే సర్వే సంగతి ఎలా ఉన్నా మళ్లీ గెలవడమే లక్ష్యంగా సొంతంగా నిర్వహించే సర్వేపై డిపెండ్‌ అవుతున్నారు. అందుకే మెజార్టీ ఎమ్మెల్యేలు సొంతంగా సర్వేలకు మొగ్గుచూపుతున్నారు. ఒక్కో ఏజెన్సీకి రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఎన్నికల వరకూ ఈ సర్వేలు కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *