సీఎమ్మార్‌ ఇవ్వని మిల్లులపై చర్యలు

సకాలంలో కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ ఇవ్వని డిఫాల్ట్‌ మిల్లర్లపై చర్యలు తీసుకొనేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎమ్మార్‌ ఇవ్వని 300 మిల్లుల జాబితాను అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ యాసంగి సీజన్‌లో ఆ మిల్లులకు ధాన్యం ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఏప్రిల్‌ మూడో వారం నుంచి ప్రారంభించాలని పౌరసరఫరాల సంస్థ భావిస్తున్నట్టు తెలిసింది. మిల్లర్లు సకాలంలో సీఎమ్మార్‌ ఇవ్వకపోవడంతో అటు కేంద్రం, ఇటు ఎఫ్‌సీఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొందరు మిల్లర్లయితే ఏడాదిగా సీఎమ్మార్‌ ఇవ్వడం లేదు. ఇందుకు 2019`20 యాసంగి సీజన్‌ సీఎమ్మారే ఉదాహరణ. 118 మిల్లులు ఇప్పటి వరకు కూడా పౌరసరఫరాల సంస్థకు సీఎమ్మార్‌ను అందించలేదు. గడువు ముగిసి మూడేండ్లు గడుస్తున్నా.. ఆ మిల్లర్లు మాత్రం సీఎమ్మార్‌ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల ఆగడాలను ఇకపై ఉపేక్షించొద్దని పౌరసరఫరాల సంస్థ భావిస్తున్నట్టు తెలిసింది.డిఫాల్ట్‌ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని భావిస్తున్న పౌరసరఫరాల సంస్థ.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. మొదటిది పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మిడిల్‌ పాయింట్‌ గోదాములను ఏర్పాటు చేసి మిగిలిన ధాన్యాన్ని ఆ గోదాముల్లోకి తరలించాలని భావిస్తున్నది. రెండోది ఇప్పటి వరకు సీఎమ్మార్‌లో లేనటువంటి మిల్లులను ఇకపై తప్పనిసరిగా సీఎమ్మార్‌లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. మిడిల్‌ పాయింట్‌ గోదాముల ఏర్పాటుపైనే అధికారులు ఎక్కువ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఆయా జిల్లాల్లో పౌరసరాల సంస్థ అధికారులు ఇప్పటికే గోదాముల గుర్తింపు పనిలో పడినట్టు తెలిసింది.ప్రస్తుతం జిల్లాల్లో ధాన్యం కొనుగోలు, సీఎమ్మార్‌ ప్రక్రియ అంతా జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతున్నది. దీనిపై జేసీలు సరిగ్గా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో కొనుగోలు ప్రక్రియ నుంచి జేసీలను తప్పించి కలెక్టర్లకు అప్పగించేందుకు పౌరసరఫరాల సంస్థ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. వీటన్నింటిపై ఏప్రిల్‌ 9 లేదా 10వ తేదీన కొనుగోళ్లపై జరిగే మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *