కశ్మీర్‌ అయిపోయింది.. ఇక కేరళనా…

ది కేరళ స్టోరీ మూవీపై రచ్చ రగులుతోంది. ది కేరళ స్టోరీ’.. ఇప్పుడొక వివాదాల కేంద్రబిందువు. థియేటర్లలోకి రాకముందే సినీజనాల్ని రెండు వర్గాలుగా విడదీస్తోంది. రాజకీయ నాయకులతో మాటల యుద్ధం చేయిస్తోంది. కొన్నివర్గాల మధ్య నిప్పు రాజేస్తోంది. ఈ చిత్రాన్ని నిషేధించాలని ఒక వర్గం డిమాండ్‌ చేస్తుంటే.. అలా చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులమడమేనని ఇంకోవర్గం వాదిస్తోంది, మరో మూడు రోజుల్లో రిలీజ్‌ కానున్నఈ చిత్రంపై కేరళలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదలను నిలిపివేయాలని అధికార, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.తప్పిపోయిన అమ్మాయిల ఇతివృత్తంతో తెరకెక్కిన ది కేరళ స్టోరీ మూవీపై వివాదం కొనసాగుతోంది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తున్న ఆరోపణలకు సంబంధించి.. వారి ఆచూకీ ఎక్కడనే కథాంశంతో ది కేరళ స్టోరీ సినిమా రూపొందించారు. దీనికి సంబంధించి కొద్దిరోజుల క్రితం ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఓ నలుగురు యువతులు మతం మారి, ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుందని అర్థమవుతోంది. అయితే.. తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. విడుదలకు సిద్ధమైన ది కేరళ స్టోరీ చిత్రంపై కేరళలో పెద్దయెత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి సినిమాను విడుదల చేయొద్దంటూ అధికార, పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా.. ఈ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఘాటుగా స్పందించారు. కేరళాను ప్రపంచం ముందు మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోందన్నారు. కానీ.. అలాంటి రాజకీయాలు కేరళలో పనిచేయవన్నారు సీఎం విజయన్‌.మరోవైపు.. ది కేరళ స్టోరీ చిత్రం విడుదలను అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సమాజంలో విషం చిమ్మేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కేరళలో ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వొద్దని డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అయితే.. వివాదం చెలరేగడంపై మూవీ డైరెక్టర్‌ సుదీప్తోసేన్‌ మరోసారి ట్విట్టర్‌ వేదికగా రియాక్ట్‌ అయ్యారు. ఈ సినిమాపై వ్యతిరేకత రానురాను రాజకీయ రంగు పులుముకుంది. అసత్యాలు, అభూతకల్పనలతో నిర్మితమైన ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ‘ఇది ఒక రాజకీయ పార్టీ అనుబంధ మతతత్వ సంస్థ పన్నాగం. కేరళలో మత రాజకీయాల చిచ్చు రగల్చడానికి న్యాయస్థానాలు సైతం తప్పు పట్టిన ‘లవ్‌ జిహాద్‌’ని ఈ సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని మేం సమ్మతించం’ అని కేరళ సీఎం పినరయి విజయన్‌ స్వయంగా హెచ్చరించడంతో… వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇదే రాష్ట్రం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ప్రముఖ నేత శశి థరూర్‌ సైతం ట్విటర్‌ వేదికగా ‘ఏదైనా తీవ్ర స్వరంతోనే చెబుదాం. ఈ సినిమాని నిషేధించాలని నేను కోరుకోవడం లేదు. భావ స్వేచ్ఛ వర్ధిల్లాలి. కానీ అసత్య ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. ఇది మన కేరళ స్టోరీ కాదని బిగ్గరగా చెప్పాల్సిందే’ అని ట్వీట్‌ చేయడంతో మరింత వేడి రాజుకుంది. ఈ ఇద్దరి నాయకుల ప్రకటనల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ సోమవారం రంగంలోకి దిగారు. ‘కేరళలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని ముఖ్యమంత్రికీ తెలుసు. ఆ విషయాన్ని ఆయన ఎప్పుడూ కొట్టిపారేయలేదు. వాస్తవాలు, గణాంకాలేంటో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఒక సినిమాని ఒక పార్టీకి అనుగుణంగా రూపొందించారని నింద వేయడం తగదు’ అని పేర్కొనడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. మరోవైపు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అదా శర్మ నాకు వందలకొద్దీ బెదిరింపు కాల్స్‌, ఎసెమ్మెస్‌లు వస్తున్నాయని వాపోయింది. కన్నూర్‌ అనే ప్రాంతంలో షూటింగ్‌ చేస్తుండగా మాపై కొందరు దాడికి తెగబడ్డారంటూ దర్శకుడు విూడియాతో చెప్పారు.విడుదలకు ముందే నలువైపులా వివాదాలు చుట్టుముట్టడంతో ఫిల్మ్‌మేకర్లు రంగంలోకి దిగారు. సినిమాని రాజకీయం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. ‘ఇందులో కల్పితమేవిూ లేదు. మా బృందమంతా కలిసి నెలలకొద్దీ పరిశోధన చేసిన తర్వాతే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాం. మొదట్లో ఈ చిత్రం నిర్మించడానికి ఏ నిర్మాతా ఒప్పుకోలేదు. ఆ సమయంలో విపుల్‌ షా ధైర్యంగా ముందడుగు వేశారు. మా కథ బాధితుల పక్షానే ఉంటుంది తప్ప.. ఇది కేరళ రాష్ట్రానికో, ఏదో ఒక వర్గానికో వ్యతిరేకం కాదు. మేం తీవ్రవాదానికే వ్యతిరేకులం తప్ప ముస్లింలకు కాదు. దీనికి మతం రంగు పులమొద్దు. నిప్పును ఎగదోసినట్టు మాటలతో రాజకీయం చేయకండి. సినిమా చూడకముందే దయచేసి ఒక నిర్ణయానికి రాకండి’ అని కోరుతున్నారు దర్శకనిర్మాతలు.ఇప్పుడే మూవీపై ఓ అభిప్రాయానికి రావొద్దని.. సినిమా చూశాక.. ఒకవేళ నచ్చకపోతే అప్పుడు చర్చిద్దామన్నారు. ఇక.. ది కేరళ స్టోరీ మూవీకి విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. ఏదేమైనా.. ది కేరళ స్టోరీ మూవీ..ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. మూవీ రిలీజ్‌కు పర్మిషన్‌ ఇవ్వద్దొని అధికార, ప్రతిపక్షాలు వార్నింగులు ఇస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *