హార్దిక్‌..మళ్లీ ముంబై వచ్చేస్తాడా?

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ కోసం పది ఫ్రాంచైజీలు తమ బలాబలాలను బేరీజు వేసుకునే పనిలోపడ్డాయి. డిసెంబరు 19న ఐపీఎల్‌ 2024 కోసం దుబాయ్‌లో మినీ ఆటగాళ్ల వేలం జరగనుంది. దీంతో ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదిలించుకోవాలనే విషయమై ఆయా జట్లు తలమునకలై ఉన్నాయి. ఈనెల 26లోపు అన్ని జట్లు తమ జాబితాలను ఐపీఎల్‌ పాలకమండలికి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉంటారనే కథనాలు బయటికి వచ్చాయి. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా… జోఫ్రా ఆర్చర్‌ స్థానంలో ముంబై జట్టులోకి వచ్చే అవకాశాలపై సోషల్‌మీడియాలో విస్తృతంగా కథనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే రోహిత్‌ శర్మ గుజరాత్‌కు వెళ్తాడంటూ వార్తలు వస్తున్నా…అతను ముంబైతోనే ఉంటాడన్నది ఐపీఎల్‌ వర్గాల సమాచారం.

కర్రాన్‌, స్టోక్స్‌ అవుట్‌

క్రితం వేలంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా సామ్‌ కర్రాన్‌ చరిత్ర సృష్టించాడు. పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఏకంగా రూ.18.50 కోట్లకు కొనుగోలు చేయగా, ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు మాత్రమే తీసి దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఈసారి పంజాబ్‌ అతడిని వదిలేసి భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవాలనుకుంటోంది. అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతానని ప్రకటించిన స్టోక్స్‌ను సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిలీజ్‌ చేయాలనుకుంటోంది. అతడిపై రూ.16.25 కోట్లు వెచ్చించినా ఆడింది రెండు మ్యాచ్‌లే. ప్రిటోరియస్‌, కైల్‌ జేమిసన్‌లను కూడా సీఎ్‌సకే విడుదల చేయనుంది. మరోవైపు రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీగా ఆశలు పెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. 11 మ్యాచ్‌ల్లో 190 రన్స్‌ మాత్రమే చేయగలిగాడు.

కేకేఆర్‌ నుంచి ఎక్కువగా..

ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. చాలాకాలంగా కేకేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌లను కూడా వదిలేసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే రస్సెల్‌పై ఇంకా నమ్మకమున్నట్టు చెబుతున్నారు. అలాగే పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఫెర్గూసన్‌, సౌథీ, షకీబ్‌, లిట్టన్‌ దాస్‌, డేవిడ్‌ వీస్‌ వేలంలో కనిపించనున్నారు.

ఐపీఎల్‌ అందరి చూపు హెడ్‌పైనే..

ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్‌ అందించడంలో కీలకంగా వ్యవహరించిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌పై వేలంలో అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించే అవకాశం ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో 329 పరుగులు చేసిన హెడ్‌.. ఫైనల్లో 137 రన్స్‌తో భారత్‌ ఆశలను ఆవిరి చేశాడు. ఇప్పటికే తను వేలంలో పాల్గొంటున్నట్టు హెడ్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఐపీఎల్‌ అతడికి కొత్తేం కాదు. 2016, 2017లో ఆర్‌సీబీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (ఇప్పుడు డీసీ) తరఫున ఆడి 10 మ్యాచ్‌ల్లో 205 పరుగులు చేశాడు. ఈసారి కూడా డీసీ అతని కోసం ప్రయత్నిస్తుందని మెంటార్‌ రికీ పాంటింగ్‌ తెలిపాడు. గతేడాది డిసెంబరులో జరిగిన వేలంలో హెడ్‌ను ఏ జట్టూ పట్టించుకోలేదు. అలాగే కివీస్‌ ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర కూడా వన్డే వరల్డ్‌క్‌పలో 578 పరుగులతో విశేషంగా ఆకట్టుకున్నాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌గా సేవలందించగలడు. దీంతో ఇతడిపైనా లుక్కేయడం ఖాయమే. ఎనిమిదేళ్ల తర్వాత ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కూడా వేలానికి రాబోతున్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *