లోన్‌ యాప్‌ ల ఆగడాలు

సగటు మనిషి బలహీనతలే పెట్టుబడిగా వడ్డీవ్యాపార సంస్థలు రుణయాప్‌ల పేరుతో చేస్తున్న ఆగడాలకూ అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముక్కూమొఖం తెలియకపోయినా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తక్కువ వడ్డీలకే రుణాలంటూ జలగల్లా పీడిరచుకు తింటున్నారు. రాష్ట్రంలో ఒక మంత్రి, మాజీమంత్రి ఈ కంపెనీల బారినపడ్డారంటే, ఒక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పోలీసు లెక్కల ప్రకారం రుణయాప్‌లు వినియోగిస్తున్న యజమానులు పెట్టే మానసిక ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఒక విద్యార్థినితోపాటు నలుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రుణాలు తీసుకున్న వారు కట్టకపోతే పూర్తి అనైతిక పద్దతులను వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్లో కుటుంబ సభ్యులను అవమానించడం, ఫోటోలను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌సైట్లలో పెట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు. ముందుగానే తీసుకున్న నంబర్లకు వాట్సాప్‌ ద్వారా కుటుంబ సభ్యులను హింసించే విధంగా మెసేజ్‌లు పెడుతుండటంతో మానసికంగా కుంగిపోతున్నారు. యువకులైతే అతను బాలికలను రేప్‌ చేశాడని, మహిళలయితే ఆమె వ్యభిచారిణి అని, యువతులైతే కాల్‌గర్ల్‌అని, వివాహితుడైతే అతని భార్యతో వ్యభిచారం చేయిస్తున్నాడని ఇలా అడ్డగోలుగా మెసేజ్‌లు పంపుతున్నారు. ఇటువంటి వాటి దెబ్బకు పోలీసు శాఖలో పనిచేసే కానిస్టేబుళ్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాల్‌మనీ ఘటనలు మరువకముందే రుణయాప్‌ల వ్యవహారం ప్రాణాలను హరిస్తోంది. ‘విూ మొబైల్‌ ఫోన్‌లో ఒకే క్లిక్‌తో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి ఎలాంటి హావిూ లేకుండానే రుణం తీసుకోండి’ అనే ఆకర్శనీయమైన ప్రకటనలు అంతే తేలికగా ప్రాణాలు తీస్తున్నాయి. రుణాలు తీసుకునే వారిని నేరుగా అడగకుండా వారి బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి వేధించే కొత్త పద్ధతిని రుణయాప్‌ల యజామనులు వినియోగిస్తున్నారు. రుణం కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని విూ బంధువులు, స్నేహితులకు సంబంధించి 20 ఫోన్‌నెంబర్లు ఇస్తే చాలనే కండీషన్‌తో తతంగం మొదలవుతోంది. 20 ఫోన్‌ నంబర్‌లే కదా అని తనకు తెలిసిన వారి ఫోన్‌ నెంబర్లను ఇవ్వగానే ఆ ఫోన్‌ నెంబర్ల వారితో వున్న బంధాన్ని తెలుసుకొని అడిగనంత లోన్‌ ఇస్తారు. ఈ రుణయాప్‌తో లోన్‌తీసుకున్న వారు తిరిగి నెలవారీ వంతులు చెల్లించాల్సి వచ్చే సరికి నిజస్వరూపం చూసి భయాందోళన చెందుతున్నారు. రుణమెప్పుడు చెల్లిస్తారు… డబ్బు తీసుకున్నాక చెల్లించేది లేదా… లోను కడతారా…విూ బంధువులు, స్నేహితుల ఫోన్లకు సందేశాలు పంపమంటారా… అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫోన్‌ తీసే వరకూ కాల్స్‌ దాడి చేస్తారు. అత్యాధునిక సాంకేతికత, ఆటోమేటిక్‌ కాల్‌ డేటా ఏర్పాటు లాంటి ప్రక్రియతో ఒకే నంబరుకు ఎక్కువ సార్లు కాల్స్‌ పంపేలా చర్యలు తీసుకుంటారు. స్నేహితులు, బంధువుల ఫోన్‌లకు సందేశాలు చివరకు ఫొటోల మార్ఫింగ్‌తో బూతు బొమ్మలను పంపుతున్నారు. కర్నూలు నగరంలో మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ యువకుడి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అందరికీ పంపించారు. రుణ గ్రహీత ఇచ్చిన 20 నెంబర్లకే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఆయన ఫోన్లో నెంబర్‌లన్నీ సేకరించి వారికీ మెసేజులు పంపుతున్నారు. ఇందుకోసం ఏజెన్సీలు, వ్యక్తుల సాయం తీసుకుంటున్నారు. లోన్‌ రికవరీలో రెండు నుండి 2.5 శాతం దాకా కమిషన్‌ రూపేణా ఇస్తుండటంతో రుణయాప్‌లలో పనిచేసేందుకు ఎక్కువమంది ముందుకు వస్తున్నట్లు తెలిసింది. మొదట సాధారణ వడ్డీగానే చెప్పినా సకాలంలో కట్టలేని వారినుండి ఐదు శాతం నుండి 10 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ రుణయాప్‌ను నిషేదించడంతో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని టిడిపి కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డిజిపి కెవి రాజేంధ్రనాధ్‌రెడ్డికి లేఖ రాశారు. ఆన్‌లైన్‌ రుణయాప్‌లు ప్రజలకు ఉరి తాళ్లుగా మారాయని, రుణాల పేరిట అమాయకుల మాన,ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్‌బిఐ అనుమతి లేకుండా రుణయాప్‌లు కొనసాగుతున్నాయన్నారు. క్షణాల్లో రుణాల పేరుతో ఆన్‌లైన్‌ రుణయాప్‌ల ఊబిలోకి దింపి తీసుకున్న రుణానికి పదింతలు ఎక్కువగా కట్టించుకుంటూ సామాన్యులను గుల్ల చేస్తున్నారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోన్‌ యాప్‌ ఆగడాలపై లోతుగా విచారణ చేస్తున్నాం. డిజిపి రాజేంథ్రనాథ్‌రెడ్డి తెలిపారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరికీ ఆధార్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ ఇవ్వకూదని అన్నారు. లోప్‌యాప్‌ డేటాలను సేకరిస్తున్నామని వివరించారు. లోన్‌ వసూళ్లలో బయట వ్యక్తుల ప్రమేయం ఉంటే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని డిజిపి హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *