వెలుగులోకి చికోటి బాగోతాలు

కాసినో ఈవెంట్‌ల నిర్వహణ, దాని వెనక భారీ స్థాయిలో చేతులు మారిన నగదు, హవాలా ద్వారా దేశ సరిహద్దులు దాటిన తీరు, బ్యాంకు ఖాతాల నుంచి వేర్వేరు వ్యక్తులకు బదిలీ అయిన అమౌంట్‌ తదితరాలన్నింటిపై చీకోటి ప్రవీణ్‌ను ఎన్‌పోర్స్‌ మెంట్‌ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆయనతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న స్నేహితుడు మాధవ రెడ్డి, విమాన ప్రయాణాలను సమకూర్చిన ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థ అధినేతను కూడా అధికారులు ప్రశ్నించారు. గత వారం జారీ చేసిన సమన్లకు అనుగుణంగా ఈ ముగ్గురూ ఈడీ కార్యాలయంలో విచారణ కోసం హాజరయ్యారు. బ్యాంకు స్టేట్‌మెంట్లతో సహా విచారణకు వచ్చిన ప్రవీణ్‌ కాసినో ఈవెంట్‌ల గురించి, ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో వివరించినట్లు తెలిసింది.హవాలా మార్గంలో డబ్బులు దేశ సరిహద్దులు దాటి చేతులు మారినట్లు పలు ఆధారాలు లభ్యం కావడంతో గత వారం ఏక కాలంలో ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొబైల్‌ ఫోన్‌, వాట్సాప్‌ చాటింగ్‌, లాప్‌టాప్‌లోని డేటా, బ్యాంకు పాసు పుస్తకాలు, నగదు బదిలీ తదితరాలన్నింటి వివరాలను సేకరించారు. వాటి ఆధారంగా సోమవారం విచారణలో ప్రవీణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పేకాట ఆడేందుకు హైదరాబాద్‌ నుంచి తీసుకెళ్ళినవారికి చెల్లించిన డబ్బులు, ప్రమోషన్‌ కోసం సెలెబ్రిటీలు, సినీ తారలతో రూపొందించిన వీడియోలకు చేసిన ఖర్చు, వారికి పారితోషికం రూపంలో చెల్లించిన నగదు.. తదితర అన్ని వివరాలను ఈ విచారణ సందర్భంగా ప్రశ్నించినట్లు తెలిసింది.చీకోటి ప్రవీణ్‌ సమర్పించిన బ్యాంకు స్టేట్‌మెంట్లలోని వివరాలను తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ గోయల్‌ నేతృత్వంలో విచారించారు. కాసినోలో కాయిన్‌లకు ఆ దేశ కరెన్సీతో జరిగే మార్పిడి, ప్రైజ్‌ మనీ చెల్లించడానికి ఫారెన్‌ కరెన్సీలోకి మార్చి ఇవ్వడం, హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించడంలో పాలుపంచుకున్నవారి వివరాలన్నింటిపైనా ఈ విచారణలో ఆరా తీసినట్లు తెలిసింది. ప్రవీణ్‌, మాధవ రెడ్డి, ట్రావెల్స్‌ అధినేతతో పాటు బేగంబజార్‌, జూబ్లీ హిల్స్‌ ప్రాంతాలకు చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్లకు కూడా ఈడీ గత వారమే నోటీసులు జారీ చేసింది. తాజా విచారణలో ముగ్గురిని మాత్రమే విచారించగా మిగిలిన వారిని కూడా విచారించనుంది.సినీ తారలతో, సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్లతో ఉన్న సంబంధాలు, వారిచేత ప్రమోషనల్‌ వీడియోలు రూపొందించేందుకు చెల్లించిన పారితోషికం, బ్యాంకు లావాదేవీల్లోని వివరాల ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్‌ తనతోపాటు ఒక అడ్వొకేట్‌ను కూడా తీసుకెళ్ళారు. బ్యాంకుల నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్లన్నింటినీ ఈడీ అధికారులకు అందజేశారు. రాజకీయ నాయకులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, కాసినో ఈవెంట్లకు వచ్చినవారెవరు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిటీషియన్లు కేవలం కాసినోకు మాత్రమే పరిమితమయ్యారా లేక ఇతర కార్యకలాపాలు ఏమేం జరిగాయి, వారి ఇన్‌వాల్వ్‌ మెంట్‌ ఎంత.. ఇలాంటి ప్రశ్నలకూ సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. పది మంది సినీ తారలు, ఇరవై మంది రాజకీయ నాయకులు, సుమారు 200 మందికిపైగా కస్టమర్ల వివరాలపై ఆరా తీసినట్లు తెలిసింది. విమాన ప్రయాణాలకు టికెట్లను ఖరీదు చేయడం గురించి కూడా ప్రశ్నించారు.ఇదిలా ఉండగా చీకోటి ప్రవీణ్‌ పేరుతో సోషల్‌ విూడియాలో ప్రచారంలోకి వచ్చిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘నన్ను బలిపశువును చేయాలని చేస్తే నా చేత ఈ పనులు చేయించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను.. సీఎం అయినా మంత్రులు అయినా, ఇంకెవరైనా.. అందరికీ ఒకటే న్యాయం..’ అంటూ చీకోటి ప్రవీణ్‌ పేరుతో వెలుగులోకి వచ్చిన ట్వీట్‌ మెసేజ్‌కు టీఆర్‌ఎస్‌ అభిమానిగా ఉన్న ఒక మహిళ కూడా స్పందించింది. ఏంటండీ.. వీడు మాట్లాడేది.. నాకు ఎందుకో చాలా బాధగా ఉంది.. అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్‌ ద్వారానే పంచుకున్నారు. వీరిద్దరి ట్వీట్‌ల వార్‌తో చాలా మంది దానికి స్పందించారు. కానీ చివరకు అది ఫేక్‌ ట్వీట్‌ మాత్రమేనని, చీకోటి ప్రవీణ్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి నకిలీ ఐడీ సృష్టించి ప్రచారం చేశారని తేలింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *