బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ ఎంఐఎం

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పీడ్‌ పెంచారు. ఇన్నాళ్లు అధికార బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఒవైసీ తాజాగా స్వరం మార్చారు. ఆదిలాబాద్‌ సభా వేదికగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇన్నాళ్లు కేసీఆర్‌కు అండగా నిలిచిన అసద్‌ తాజాగా స్వరం మార్చడంతో ఆయన బీఆర్‌ఎస్‌తో కటీఫ్‌ అవుతున్నారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి గత కొంత కాలంగా బీఆర్‌ఎస్‌తో ఎంఐఎంకు చెడిరదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు షాకిచ్చేలా తమకు బలమున్న నియోచకవర్గాలన్నింటిలో పోటీకి దిగాలని మజ్లిస్‌ ప్రయత్నాలు చేస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అసద్‌ టార్గెట్‌ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్టీరింగ్‌ మా చేతిలో ఉందని కొందరు పదే పదే చెబుతున్నారని, స్టీరింగ్‌ మా చేతిలో ఉంటే కేసీఆర్‌ మా పనులు ఎందుకు చేయడం లేదని ఈ సందర్భంగా ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పని చేయరడం లేదని షాదీ ముబారక్‌ చెక్కులు సంవత్సరమైనా రావట్లేదని మండిపడ్డారు. గచ్చిబౌలిలో స్థలం ఇచ్చినా ఇప్పటి వరకు ఇస్లామిక్‌ సెంటర్‌ నిర్మాణం జరగలేదు గానీ బ్రాహ్మణ సదన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ధ్వజమెత్తారు. మసీదు కూల్చిన చోట కొత్తది ఏర్పాటు చేయలేదు కానీ కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయిందన్నారు. తెలంగాణలో ఆలయాల కోసం రూ.2500 కోట్ల నిధులు ఖర్చే చేశారని ఎన్నో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు పెట్టారన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో రామ మందిరాలు నిర్మిస్తామని చెప్పాడు. కానీ ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఎలాంటి పనులు జరగడం లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు తన పేరు చెప్పుకోవడమే పనిగా మారిందని బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మా అండదండలు ఉంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలని ఈ సంగతి గుర్తుంచుకోవాలన్నారు.కొంత కాలంగా ఎంఐఎం తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. బీఆర్‌ఎస్‌ పెట్టిన నాటి నుంచి ఎంఐఎంకు బీఆర్‌ఎస్‌కు మధ్య గ్యాప్‌ పెరిగినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మజ్లీస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌కు బేషరతుగా మద్దతు తెలుపుతూ వస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించాక అసదుద్దీన్‌ ఒవైసీకి కేసీఆర్‌కు మధ్య గ్యాప్‌ పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ అవతరించాక అసదుద్దీన్‌ కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు. డిసెంబర్‌ 9న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి సైతం ఒవైసీ హాజరుకాలేదు. ఢల్లీిలో జరిగిన పార్టీ కార్యాలయం ఓపెనింగ్‌ కార్యక్రమంలోనూ మజ్లీస్‌ ప్రతినిధులు కనిపించలేదు.ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీలో అక్బరుద్దీన్‌ మంత్రి కేటీఆర్‌తో ఏకంగా ఛాలెంజ్‌ చేయడం హాట్‌ టాపిక్‌ అయింది. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి 15 చోట్ల తప్పక గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని అక్బరుద్దీన్‌ చేసిన సవాల్‌ సంచలనం రేపింది. ఇంతలో ఆయన సోదరుడు అసదుద్దీన్‌ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సెన్సేషన్‌గా మారాయి. అయితే అసద్‌ కామెంట్స్‌ వెనుక పక్కా వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలే అసద్‌ స్వరం మార్చడానికి రీజన్‌ అనే వాదన వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకుంటోంది. ఈ క్రమంలో తన వర్గం కాంగ్రెస్‌ వైపు మళ్లకుండా ముందస్తు వ్యూహంలో భాగంగానే అసద్‌ తాజాగా కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎంఐఎం చీఫ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *