బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడిన జెరూసలేం, ఒకరి మృతి,14 మందికి గాయాలు

ఇజ్రాయెల్ (Isreal) రాజధాని జెరూసలేం (Jerusalem) బుధవారంనాడు జంట బాంబు దాడులతో (Twin bomb attacks) దద్దరిల్లింది. బస్‌స్టాప్‌ల వద్ద జరిగిన ఈ బాంబు పేలుళ్లలో ఒక బాలుడు మృతి చెందగా, సుమారు 14 మంది గాయపడ్డారు. మొదటి పేలుడులో ఒక బాలుడు మరణించగా, మరో 11 మంది మంది గాయపడ్డారు. రెండో పేలుడులో ఇంకో ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడుల ఘటనను ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా శాఖ మంత్రి ఒమెర్ బర్-లెవ్ ఖండించారు. చాలా కాలం తర్వాత ఈ తరహా పేలుళ్ల ఘటన చోటుచేసుకుందని చెప్పారు.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా సిటీల్లో ఇజ్రాయెల్ మిలటరీ దాడుల‌ క్రమంలో ఇజ్రాయెల్ ప్రజలను టార్గెట్ చేసుకుని ఈ ఏడాది తుపాకీ దాడులు, కత్తిదాడులు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పేలుడు పదార్ధాలతో దాడులు జరపడం జెరూసలేంలో చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం పోలీసు యంత్రాగాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.

కాగా, బుధవారంనాడు జరిగిన రెండు పేలుళ్లలో మొదటిది జెరూసలేం సిటీ ప్రధాన ద్వారానికి సమీపంలో ఉదయం 7.05 గంటల ప్రాంతంలో జరిగింది. 30 నిమిషాల అనంతరం సిటీ మరో ప్రధాన ద్వారమైన రామోట్ జంక్షన్ వద్ద రెండో బాంబు పేలింది. ప్రజలు భయంతో పరుగులు తీయడం, పేలుడు ధాటికి శిథిలాలు చెల్లాచెదురుకావడం వంటివి కెమెరాల్లో చిక్కాయి. రెండూ పేలుడు ఘటనలే కావడం, పేలుడు జరిగిన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఇది ఉగ్రవాద దాడి కావచ్చనే అనుమానాలను పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఘటన అనంతరం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యార్ లాపిడ్ దేశ సెక్యూరీటీ చీఫ్‌లతో ప్రత్యేక సమావేశం జరిపారు. జంట పేలుళ్ల ఘటనను ఇజ్రాయెల్‌లోని అమెరికా, యూకే రాయబార కార్యాలయాలు వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *