కాంగ్రెస్‌ టూ బీజేపీ… భారీ చేరికలు ఉంటాయా

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో పెద్ద ఎత్తున నేతల చేరికలు ఉండే అవకాశం కనపిస్తోంది. భారతీయ జనతా పార్టీలో చేరిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏపీ బీజేపీ బలోపేతం కోసం అప్పుడే గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో ఆయన అనుచరులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే జైసమైక్యాంధ్ర పార్టీ వైఫల్యం తర్వాత రాజకీయ భవిష్యత్‌ కోసం ఎక్కువ మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. కొంత మంది సొంత కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వారందరూ మళ్లీ కిరణ్‌ కుమార్‌ రెడ్డితో టచ్‌లోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. కిరణ్‌ సమక్షంలో ఒకే సారి భారీగా చేరికల కోసం ప్లాన్‌ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొంత మంది మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. పల్లంరాజు, ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, జీవీ హర్షకుమార్‌, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా కిరణ్‌తో సన్నిహితంగా ఉన్నా.. కాంగ్రెస్‌ పార్టీని విడిచి పెట్టి రాలేదు. వీరందరితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం కూడా కిరణ్‌ కుమార్‌ రెడ్డికి పూర్తి స్థాయిలో చేరికల విషయంలో స్వేచ్చ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎవర్నీ అయినా ఆహ్వానించవచ్చునని వర్గ పోరాటాలకు అవకాశం ఉండకుండా చూస్తామని హావిూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ చాలా మంది కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరాలని అనుకున్నారు కానీ వారికి సరైన వేదిక దొరకలేదు. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేరికతో వారందరికీ ఓ దారి కనిపించినట్లయిందని భావిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. అక్కడక్కడ మిగిలి ఉన్న నేతలు పార్టీ హైకమాండ్‌ పై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్‌ అధ్యక్షుడ్ని మార్చారు. అయితే ప్రజాప్రతినిధిగా కూడా ఎన్నిక కాని గిడుగు రుద్రరాజు నియమించడంతో చాలా మంది సీనియర్లు అసంతృప్తికి గురయ్యారు. బహిరంగంగానే తమ వ్యతిరేకతను తెలిపారు. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు కిరణ్‌ సాయంతో వారంతా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కరుగా కాకుండా పెద్ద ఎత్తున మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో మంచి ముహుర్తం చూసుకుని చేరికల కార్యక్రమాలను ఖరారు చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో కొ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏపీ బీజేపీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి మూడు వారాల పాటు కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత చేరికలపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *